దళిత బంధుపై హైకోర్టులో పిటిషన్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న దళిత బంధు పధకం అమలు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో ఓ ప్రజాహిత పిటిషన్‌ (పిల్) దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనంతో అమలుచేస్తున్న ఈ పధకానికి సంబందిత అధికారులు, జిల్లా కలెక్టర్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయవలసి ఉండగా, అధికార బిఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా ఎంపిక చేస్తోందని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

దళిత బంధు పధకానికి మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులకే కట్టబెట్టుకొంటున్నారని, దీని వలన నిజంగా అవసరమున్న దళితులకు ఈ పధకం అందడంలేదని పిటిషనర్ పేర్కొన్నారు. కనుక లబ్ధిదారుల ఎంపిక విధానాన్ని మార్చవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ హైకోర్టుని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసును రెండు వారాలకు వాయిదా వేసింది. 

దళిత బంధు పధకానికి లబ్ధిదారులను ఎంపిక చేసే క్రమంలో కొందరు ఎమ్మెల్యేలు లబ్ధిదారుల నుంచి బలవంతంగా లంచాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌ బిఆర్ఎస్ తాటికొండ రాజయ్యపై ఇటువంటి ఆరోపణలు వచ్చినందునే ఈసారి సిఎం కేసీఆర్‌ ఆయనకి ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్‌ నిరాకరించిన సంగతి తెలిసిందే.