8.jpg)
బిజెపి తన హిందుత్వ అజెండాను రాజకీయాలకు ఉపయోగించుకొంటున్నా, హిందుత్వ అజెండా, ఆ సిద్దాంతానికి కట్టుబడిన నేతలు నేటికీ చాలా మంది ఉన్నారని చెప్పడానికి ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగే ప్రత్యక్ష నిదర్శనం. ఆయనపై బిజెపి సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ, ఆయన “ఉంటే బిజెపిలోనే ఉంటా లేకుండా రాజకీయాల నుంచి తప్పుకొంటాను తప్ప కాంగ్రెస్ వంటి సెక్యులర్ పార్టీలో చేరబోనని” నేడు విస్పష్టంగా చెప్పారు. బిజెపి అధిష్టానం సరైన సమయంలో తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తుందని నమ్మకం ఉందని రాజాసింగ్ అన్నారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఎన్నికలకు దూరంగా ఉంటానని రాజాసింగ్ చెప్పారు.
సిఎం కేసీఆర్ 115 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించి ఘోషామహల్ అభ్యర్ధిని ప్రకటించకపోవడంపై స్పందిస్తూ, “ఎందుకంటే ఆ సీటు కేసీఆర్ చేతిలో ఉండదు. ఓవైసీ చేతిలో ఉంటుంది. ఆయనే అక్కడ బిఆర్ఎస్ అభ్యర్ధిగా ఎవరు పోటీ చేయాలో నిర్ణయిస్తారు,” అని అన్నారు.
రాజాసింగ్‌ను జహీరాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని బిజెపి అధిష్టానం కొరిన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి పోటీ చేస్తే సస్పెన్షన్ ఎత్తివేస్తామని సూచించినట్లు సమాచారం. కానీ రాజాసింగ్ ఘోషామహల్ సీటుని వదిలి వెళ్ళేందుకు ఇష్టపడటం లేదు. అంతకంటే రాజకీయాలను విడిచిపెట్టేందుకు సిద్దమంటున్నారు. కనుక బంతి బిజెపి కోర్టులోనే ఉన్నట్లు లెక్క. మరి రాజాసింగ్‌ని నిలుపుకొంటుందో, వదులుకొంటుందో?