ఉరి తీసేటప్పుడు కూడా చివరి కోరిక అడుగుతారు: భేతిరెడ్డి

బిఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాలో మళ్ళీ సీట్లు దక్కనివారు సిఎం కేసీఆర్‌ మీద తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వారిలో ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి కూడా ఒకరు. కేసీఆర్‌ ఆయనను పక్కన పెట్టి బండారు లక్ష్మారెడ్డికి టికెట్‌ కేటాయించారు. దీంతో భేతి సుభాష్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి తన మనసులో బాధను వెల్లడించారు. 

2001లో కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాలు ప్రారంభించినప్పటి నేను ఆయన వెంటనడుస్తూనే ఉన్నాను. ఉద్యమ సమయంలో పోలీసులు ఎంతగా నన్ను వేదించినా వెనకడుగు వేయలేదు. బిఆర్ఎస్ పార్టీతోనే నా రాజకీయ జీవితం పెనవేసుకుపోయింది. అందుకే కేసీఆర్‌ నాకు 2014లో టికెట్‌ ఇచ్చారు. కానీ అప్పుడు నేను ఓడిపోయాను. ఆ తర్వాత 2008 నుండి ఉప్పల్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నాను. 2018 ముందస్తు ఎన్నికలలో మళ్ళీ టికెట్‌ ఇస్తే పోటీ చేసి గెలిచాను. 

ఇన్నేళ్ళుగా కేసీఆర్‌ వెంట నడిస్తే చివరికి ఇంత అవమానకరంగా నన్ను తప్పించడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. కనీసం పిలిచి ముందుగా ఓ మాట చెప్పినా లేదా తర్వాత అయినా ఓసారి పిలిచి ఎందుకు టికెట్‌ ఇవ్వలేదో చెప్పి ఉంటే నేను ఇంతగా బాధపడేవాడిని కాను. ఉరి తీసేటప్పుడు కూడా చివరి కోరిక అడుగుతారు కానీ కేసీఆర్‌ నాతో ఆవిదంగా కూడా వ్యవహరించలేదు. 

బిఆర్ఎస్ పార్టీలో ఇక ఉద్యమకారులకు చోటు ఉండదా?ఎన్నికలలో ఎవరు డబ్బు ఖర్చు చేయగలిగితే వారికే సీట్లు ఇస్తుంటారా? బండారు లక్ష్మారెడ్డి ఏనాడైనా తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నారా? బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేశారా?కేవలం ఓ ట్రస్ట్ పెట్టి ఆ ముసుగులో అందరికీ డబ్బులు పంచుతుంటారు. అందుకేనా ఆయనకు టికెట్‌ ఇచ్చింది నాకు నిరాకరించింది?ఇప్పటికైతే పార్టీ మారే ఆలోచన లేదు నాకు. మరో 10 రోజులలో కేసీఆర్‌ నా టికెట్‌ విషయమై నిర్ణయం మార్చుకోకపోతే అప్పుడు నా కార్యాచరణ ప్రకటిస్తాను,” అని అన్నారు.