పాతబస్తీలో మెట్రోకు అడుగడుగునా అడ్డంకులే!

హైదరాబాద్‌ నగరంలో నలువైపులా మెట్రోని విస్తరించగలిగారు కానీ ఏంజీబిఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు గల 5 కిమీలో మాత్రం ఇంతవరకు మెట్రో కారిడార్‌ ఏర్పాటు చేయలేకపోయారు. పాతబస్తీ మీదుగా మెట్రో ఏర్పాటు చేయాలని సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సోమవారం హైదరాబాద్‌ మెట్రో సంస్థ, ఎల్ అండ్ టి అధికారులు కలిసి పాతబస్తీలో డ్రోన్ సాయంతో మరోసారి సర్వే నివహించారు. 

ఈ సర్వేలో పాతబస్తీలో 21 మసీదులు, 33 దర్గాలు, 12 అషూర్ ఖానాలు, 12 గుళ్ళు, 7 శ్మశానవాటికలు, 6 చిల్లాలు ఉన్నట్లు గుర్తించారు. డ్రోన్ కెమెరాతో సర్వే చేసిన ఫోటోలను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వీటన్నిటికీ నష్టం కలిగించకుండా మెట్రో కారిడార్‌ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 

ఈ మార్గంలో మెట్రో పిల్లర్లు ఏర్పాటు చేసేందుకు భూమిలో బలం ఉందా లేదా?ఉంటే ఎక్కడెక్కడ మెట్రో పిల్లర్లు వేయాలనే విషయం నిర్ధారించుకొనేందుకు ముందుగా ‘సాయిల్ టెస్ట్’ కోసం టెండర్లు పిలిచామని మెట్రో అధికారులు తెలిపారు. త్వరలోనే సాయిల్ టెస్టింగ్ పనులు మొదలవుతాయని తెలిపారు. 

ఏంజీబిఎస్ నుంచి సాలార్ జంగ్ మ్యూజియం, ఛార్మినార్, శాలిబండ, షంషేర్ గంజ్ మీదుగా ఫలక్‌నుమా వరకు మెట్రో కారిడార్‌ నిర్మించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. కానీ ఇన్నేళ్ళుగా దీని గురించి ఆలోచించని ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలకు ముందు సర్వేలు చేయిస్తుండటం చూస్తే ఇది ఎన్నికల కోసమే చేస్తున్న హడావుడా లేక నిజంగానే నిర్మించాలని ప్రయత్నిస్తోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.