జనగామ టికెట్‌ ఎవరికో?

బిఆర్ఎస్ తొలి జాబితాలో పెండింగులో పెట్టిన నాలుగు స్థానాలలో జనగామ కూడా ఒకటి. ప్రస్తుతం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ సిఎం కేసీఆర్‌ ఆయనకు టికెట్‌ ఖరారు చేయలేదు. అలాగని మరొకరికీ కేటాయించలేదు. కానీ అక్కడ నుంచి ఈసారి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్‌ ఇవ్వాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ముత్తిరెడ్డి కూడా పల్లా మీదే నిప్పులు చెరుగుతుండటం గమనిస్తే పల్లాకు టికెట్‌ ఇచ్చేందుకే కేసీఆర్‌ మళ్ళీ ముత్తిరెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించలేదని స్పష్టమవుతోంది. కానీ పల్లా పేరు కూడా ప్రకటించకపోవడం గమనిస్తే ముత్తిరెడ్డిని కూడా పూర్తిగా కాదనలేదని అర్దమవుతుంది. కనుక జనగామలో వారిద్దరిలో ఎవరికి టికెట్‌ లభిస్తుందో అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆలోగా ఇద్దరి మద్య టికెట్‌ కోసం భీకర యుద్ధాలు జరుగుతున్నాయి. 

పల్లా ఎమ్మెల్సీగా గెలిచేందుకు నేను ఎంతగానో సాయపడ్డానని కానీ చివరికి తనకే ద్రోహం తలపెట్టాడని ముత్తిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముత్తిరెడ్డి భూకబ్జాల గురించి, అధికారులు, పార్టీ నేతలు, కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుండటం గురించి సిఎం కేసీఆర్‌కు బాగా తెలుసని అందుకే ఆయనను పక్కన పెట్టి ఈసారి తనకు జనగామ టికెట్‌ ఇవ్వబోతున్నారని పల్లా వాదిస్తున్నారు. 

ముత్తిరెడ్డిపై ఎన్ని పిర్యాదులు ఉన్నప్పటికీ నియోజకవర్గంలో గెలుపోటములను శాషించగలరు కనుక ఆయనకు ఏదో పదవి ఇచ్చి బుజ్జగించి, పల్లాకు టికెట్‌ ఖరారు చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వినకపోతే పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ మొదటి వారంలో జనగామ, నర్సాపూర్, నాంపల్లి, ఘోషామహల్ నాలుగు సీట్లకు కూడా అభ్యర్ధులను ప్రకటించవచ్చని తెలుస్తోంది.