
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అందరి కంటే ముందుగా సిఎం కేసీఆర్ 115 మంది బిఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించడంతో కాంగ్రెస్, బిజెపిలపై ఒత్తిడి పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా 119 స్థానాలకు మొత్తం 1,016 మంది దరఖాస్తు చేసుకొన్నారు.
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన స్క్రీనింగ్ కమిటీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్‌లో భేటీ అయ్యి ఈ దరఖాస్తులలో నుంచి ఎన్నికలలో పోటీ చేయగల సామర్ధ్యం ఉన్నవారిని ఎంపిక చేస్తుంది. ఒక్కో నియోజకవర్గానికి 3-4 మంది అభ్యర్ధుల చొప్పున ఎంపిక చేసి కాంగ్రెస్ అధిష్టానానికి పంపిస్తుంది.
రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు వంటి సీనియర్ నేతలు పోటీ చేసే స్థానాలలో వారి ఒక్కరి పేరునే ఖరారు చేసి అధిష్టానానికి పంపించనుంది. సుమారు 35-40 మంది సీనియర్ నేతలతో కూడిన ఆ జాబితానే సెప్టెంబర్ మొదటివారంలో ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈసారి సీనియర్ నేతలు వి.హనుమంతరావు, కె.జానారెడ్డి, రేణుకా చౌదరి, గీతారెడ్డి తదితరులు దరఖాస్తు చేసుకోలేదు. కనీసం గాంధీ భవన్‌వైపు రావడం లేదు. ఇదే సమయంలో అనేక నియోజకవర్గాలలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకొన్నవారు, ఈసారి తమకే టికెట్ ఇవ్వాలని సీనియర్ నేతల చుట్టూ తిరుగుతున్నారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి వంటి కొందరు నేతలు తమ తమ జిల్లాలలో తమ అనుచరులకే టికెట్స్ ఇప్పించుకోనున్నారు. కనుక తొలి జాబితాలో లేదా రెండో జాబితాలో వారందరి పేర్లు ప్రకటించవచ్చు.