నల్గొండలో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం!

నల్గొండ పట్టణంలో గంధావారిగూడెంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్ధిని కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. ఆమె కాళ్ళు, చేతులు, నోట్లో పళ్ళు విరిగిపోయాయి. కాలేజీ సిబ్బంది ఆమెను హుటాహుటిన జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆమె రెండు మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేయగా ఈ వార్త బయటకు పొక్కకుండా కాలేజీ ప్రిన్సిపాల్, సిబ్బంది దాచిపెట్టడంతో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఆమె చదువులలో వెనకబడటం వలననో లేదా చదువుల ఒత్తిడితోనో లేదా ప్రేమ కారణాలతో ఆత్మహత్యాయత్నం చేయలేదు. హాస్టల్లో సరైన సౌకర్యాలు లేవని, భోజనం సరిగ్గా పెట్టడం లేదని అడిగినందుకు సిబ్బంది, ఉపాధ్యాయులు ఆమెను వేదిస్తుండటంతో వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిన్నట్లు తెలుస్తోంది! ఈ విషయం మిగిలిన విద్యార్ధినులు కూడా ధృవీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలను పోలీసులు దృవీకరించాల్సి ఉంది. 

విద్యార్ధిని ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించిందనే విషయం ఆమె స్పృహలోకి వస్తే తెలుస్తుంది. ఆ విద్యార్ధిని తల్లితండ్రులు ఈ విషయం తెలుసుకొని ఆసుపత్రికి చేరుకొని, మృత్యువుతో పోరాడుతున్న తమ కూతురుని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను వేడుకొంటున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థ కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నామని, సిఎం కేసీఆర్‌ మనుమలు తినే సన్నబియ్యమే హాస్టల్ విద్యార్థులకు కూడా పంపిణీ చేస్తున్నామని గొప్పగా చెప్పుకొంటారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఈ ఘటన నిరూపిస్తోంది.