తెలంగాణలో అధికారం బిజెపి పగటి కలలే?









కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఖమ్మం సభలో మాట్లాడుతూ, తెలంగాణలో బిఆర్ఎస్‌ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయని, రాబోయేది బిజెపి ప్రభుత్వమే అని, బిజెపి ముఖ్యమంత్రి భద్రాద్రి సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పిస్తారని అన్నారు. 

దీనిపై మంత్రి హరీష్‌ రావు స్పందిస్తూ, “తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కాదు ఈసారి ఎన్నికలలో బిజెపి సింగిల్ డిజిట్ స్థానాలు గెలుచుకొన్నా గొప్పే. తెలంగాణ ప్రజలను నూకలు తిని బ్రతకాలని చెప్పినప్పుడే తెలంగాణలో బిజెపికి నూకలు చెల్లిపోయాయి. ఢిల్లీలో రైతులు ఏడాదిపాటు ఆందోళన చేసినా పట్టించుకొని మీరా...  రైతుల సంక్షేమం గురించి మాట్లాడేది? కార్పొరేట్ కంపెనీల కోసం రైతులను ముంచేసేందుకు వ్యవసాయ చట్టాలను తెచ్చి, చివరికి రైతుల ఆందోళనలకు భయపడి వాతీ వెనక్కు తీసుకొన్న మీరా... రైతుల సంక్షేమం గురించి మాట్లాడేది?బ్యాట్ సరిగ్గా పట్టుకోవడం కూడా చేతకాని మీ అబ్బాయికి బిసిసిఐ కీలక పదవి కట్టబెట్టినప్పుడు మీరు కుటుంబపాలన గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించిన్నట్లు ఉంది,” అంటూ కేంద్రాన్ని, అమిత్‌ షాని చాలా ఘాటుగా విమర్శించారు. 

ఈ విమర్శలు, ప్రతి విమర్శలను పక్కన పెడితే ఎప్పటిలాగే ఈ ఎన్నికలలో కూడా బిజెపికి 119 స్థానాలలో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్ధులు లేరు. ఒకవేళ ఏర్పాటు చేసుకొన్నా బిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్ధులను ఓడించగలవారు ఓ అరడజను మంది ఉంటారేమో? ఈ విషయం బిజెపి అధిష్టానానికి కూడా బాగా తెలుసు కనుకనే కాంగ్రెస్‌, బిఆర్ఎస్‌ నేతలను బిజెపిలోకి రప్పించేందుకు చాలా ప్రయత్నించింది. కానీ ఎవరూ బిజెపిలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. 

బండి సంజయ్‌ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయన ఒంటెత్తు పోకడల వలన ఎవరూ పార్టీలో చేరడం లేదంటూ రాష్ట్ర బిజెపి నేతలు బిజెపి అధిష్టానానికి పిర్యాదులు చేసి ఆయనను తప్పించేశారు. ఆయన తప్పుకొన్న తర్వాత కూడా ఎవరూ బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. అంటే బండి సంజయ్‌ కారణం కాదన్నమాట! 

ఎన్నికలకు ముందు బండి సంజయ్‌ని పదవిలో నుంచి తప్పించేయడంతో, బిజెపి, బిఆర్ఎస్‌ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందనే కాంగ్రెస్‌ వాదనలు ప్రజలలో బిజెపి పట్ల నమ్మకం కోల్పోయేలా చేశాయి. ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ ఎంతో బలంగా ఉన్న బిఆర్ఎస్‌ పార్టీని బిజెపి ఎలా ఓడించగలమని అనుకొంటోందో దానికే తెలియాలి.