ఎమ్మెల్యే అత్తకు టికెట్‌ రాలే... ఎస్పీ అల్లుడికి బదిలీ!

ఈసారి శాసనసభ ఎన్నికలలో మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇస్తానని సిఎం కేసీఆర్‌ చెప్పడంతో, ఖానాపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ మళ్ళీ తనే పోటీ చేసి గెలుస్తాననే చాలా ధీమాగా ఉండేవారు. కానీ మంత్రి కేటీఆర్‌ తన స్నేహితుడు జాన్సన్ నాయక్‌కు ఖానాపూర్ సీటుని ఇప్పించుకోవడంతో ఆమె షాక్ అయ్యారు. 

పార్టీ కోసం 12 ఏళ్ళుగా ఎంతో కష్టపడి పనిచేస్తున్న తనని కాదని జాన్సన్ నాయక్‌కు టికెట్‌ ఇవ్వడం ఏమిటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌ తనకు తీరని అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఖానాపూర్ నుంచే పోటీ చేసి కేటీఆర్‌ స్నేహితుడిని ఓడిస్తానని శపధాలు చేశారు. 

ఆమె పరిస్థితి ఇలా ఉంటే, ఆమె ఆగ్రహానికి ఆమె సొంత అల్లుడే బలైపోవడం విశేషం. ఆమె అల్లుడు శరత్ చంద్ర పవార్ ప్రస్తుతం మహబూబాబాద్ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయనపై హటాత్తుగా బదిలీ వేటు పడింది. వేరే జిల్లాకు కాదు... తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీకి! ఆయన స్థానంలో గుండేటి చంద్రమోహన్ని నియమిస్తూ సిఎస్ శాంతికుమారి పేరిట సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అత్తమీద కోపం దుత్త మీద చూపడమంటే ఇదేనేమో?