నకిరేకల్ నుంచే పోటీ చేస్తా కానీ... వేముల వీరేశం

మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు శాసనసభ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిఎం కేసీఆర్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ స్థానిక కాంగ్రెస్‌ శ్రేణులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక నకిరేకల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగేందుకు సిద్దమవుతున్నారు.

ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు పార్టీలో ఎన్నడూ తగిన గౌరవం లభించలేదని, ముఖ్యంగా మంత్రి జగదీష్ రెడ్డి ప్రాధాన్యం పెరిగిన తర్వాత పార్టీలో తనను ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. పైగా తనకు, తన అనుచరులు పోలీసులతో వేధింపులు ఎదుర్కోవలసి వచ్చిందని అన్నారు. ఈసారి కేసీఆర్‌ తనకు తప్పకుండా టికెట్‌ ఇస్తారని ఎంతో ఆశగా ఎదురుచూశానని, కానీ కేసీఆర్‌ కూడా తనను పట్టించుకోలేదని అందుకే పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతానా లేదా కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. 

నకిరేకల్ ప్రజలతో తమ కుటుంబానికి ఉన్న అనుబందం ఈనాటిది కాదని, కనుక వారి దీవెనలతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచి తన సత్తా చూపిస్తానని వేముల వీరేశం అన్నారు. తనకు వారసత్వంగా 30 ఎకరాల వ్యవసాయభూమి లభించిందని, దానిపై వచ్చే రాబడితో సంతృప్తిగా జీవిస్తున్నానని చెప్పారు. కనుక తాను చాలామంది రాజకీయ నాయకుల్లా ఇసుక, మద్యం, హోటల్‌ బిజినెస్సులు చేయలేదని, భవిష్యత్‌లో కూడా చేయాలనుకోవడం లేదని చెప్పారు.