మైనంపల్లి అవుట్... శంభీపూర్ రాజు ఇన్‌?

మల్కాజిగిరి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకి మళ్ళీ అదే స్థానం నుండి పోటీ చేయడానికి సిఎం కేసీఆర్‌ టికెట్‌ కేటాయించినప్పటికీ, తన కొడుకుకి కూడా మెదక్ నుంచి పోటీ చేసేందుకు టికెట్‌ ఇవ్వకపోవడంతో మంత్రి హరీష్‌ రావుపై చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు.

దీనిపై సిఎం కేసీఆర్‌ స్వయంగా స్పందిస్తూ, “అలాంటి వాళ్ళను ఉపేక్షించను. నిర్ధాక్షిణ్యంగా పార్టీలో నుంచి తీసి బయటపడేస్తాను,”అని మీడియా సమావేశంలోనే చెప్పారు. కానీ ఇంతవరకు మైనంపల్లిపై వేటు వేయకపోగా ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియడంతో మంత్రి హరీష్‌ రావు, బిఆర్ఎస్ నేతలు పలువురు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. 

కానీ బుజ్జగింపులకు మైనంపల్లి లొంగకపోవడంతో ఆయనపై వేటు వేసేందుకు కేసీఆర్‌ నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని బరిలో దింపాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయం మాట్లాడేందుకు మంత్రి హరీష్‌ రావు ఆయనతో భేటీ అయ్యారు. 

కేసీఆర్‌ తొలి జాబితాలో 115 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించారు. మరో నాలుగు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించవలసి ఉంది. కనుక వాటి కోసం ఆశావాహుల ఒత్తిడి పెరిగిపోతోంది. కనుక రెండు మూడు రోజులలో ఆ నాలుగు స్థానాలకు కూడా అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉంది. 

జనగామకు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సాపూర్-సునీతా లక్ష్మారెడ్డి, నాంపల్లి-ఆనంద్ గౌడ్, ఘోషా మహల్-నందా కిషోర్ వ్యాస్‌లను అభ్యర్ధులుగా ప్రకటించే అవకాశం ఉంది.