మునుగోడు ఉపఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిన సీపీఐ, సీపీఎం పార్టీలకు శాసనసభ ఎన్నికలలో కేసీఆర్ హాండ్ ఇవ్వడంతో అవిప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు సిద్దమయ్యాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవలేకపోతే మరో 5 ఏళ్ళపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించడం చాలా కష్టం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణలో అధికారంలోకి తీసుకువస్తానని చెప్పి పిసిసి అధ్యక్ష పదవి చేపట్టిన రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికలు పెద్ద సవాలు. కనుక రేవంత్ రెడ్డి కూడా వామపక్షాలతో పొత్తులకే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే వామపక్షనేతలతో పొత్తులు, సీట్లసర్దుబాట్ల గురించి మాట్లాడారు.
వామపక్షాలు పొత్తులకు సిద్దమే కానీ మునుగోడు, వైరా, కొత్తగూడెం, బెల్లంపల్లి, హుస్నాబాద్, భద్రాచలం, పాలేరు, మధిర, మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నం సీట్లను తమకు ఇవ్వాలని డిమాండ్ చేసిన్నట్లు తెలుస్తోంది. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ఒక్క మధిర తప్ప మిగిలిన అన్ని సీట్లను తన అనుచరులకే ఇవ్వాలనే షరతుతో కాంగ్రెస్‌లో చేరారు. కనుక వాటన్నిటినీ వామపక్షాలకు ఇవ్వలేదు. కనీసం వాటిలో మునుగోడు, కొత్తగూడెం, హుస్నాబాద్, బెల్లంపల్లి నాలుగు సీట్లు లేదా మూడు సీట్లు అయినా ఇవ్వాలని తాము కోరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. ఈ నెల 30వ తేదీలోగా మరోసారి కాంగ్రెస్‌తో సమావేశమయ్యి సీట్ల సర్దుబాటు చేసుకొంటామని చెప్పారు.