నా శ్రమని ఎవరో దోచుకొంటే చూస్తూ ఊరుకోలేను: రాజయ్య

సిఎం కేసీఆర్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌ బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యని పక్కన పెట్టి కడియం శ్రీహరికి అభ్యర్ధిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆయన తన అనుచరులను పట్టుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, కేసీఆర్‌ నన్ను పక్కన పెట్టినా నేను ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. కానీ మూడు రోజులు గడిచేసరికి మళ్ళీ మాట మార్చి, రేపోమాపో నా సీటును నేను దక్కించుకొంటానన్నట్లు మాట్లాడటం విశేషం.  

శుక్రవారం హన్మకొండ జిల్లా ధర్మాసాగర్‌లో విలేఖరులతో మాట్లాడుతూ, “భూమి కొని, దానిలో ముళ్ళు, కంపలు ఎరివేసి, దుక్కిదున్ని  సాగుచేసి, నారుపోసి, కలుపు తీసి, వరి పండించి కుప్పలు పెడితే, దానిపై ఎవరో వచ్చి కూర్చోంటానంటే ఎలా? రేపో మాపో మనం అనుకొన్న కార్యక్రమంలో జరుగబోతోంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది,” అని రాజయ్య అన్నారు. 

అంటే స్టేషన్‌ఘన్‌పూర్‌ తన కష్టార్జితమని దానిని కడియం శ్రీహరి తన నుంచి ఎత్తుకుపోతున్నారని, కనుక మళ్ళీ దానిని దక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతానని రాజయ్య చెప్పిన్నట్లు భావించవచ్చు. కానీ కేసీఆర్‌ ఓసారి అభ్యర్ధులను ఖరారు చేస్తే ఎట్టి పరిస్థితులలో వారిని మార్చేందుకు అంగీకరించరు. ఈ విషయం రాజయ్యకు కూడా అనుభవపూర్వకంగా తెలుసు. కనుక కడియం శ్రీహరిని గెలవనీయకుండా దెబ్బ తీసేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది.