అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రకటన?

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అక్టోబర్ రెండో వారంలో కేంద్ర ఎన్నికల కమీషన్‌ (సీఈసీ) షెడ్యూల్ ప్రకటించనుంది. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు కేంద్ర ఎన్నికల కమీషన్‌ తరపు అధికారుల బృందాలు ఆయా రాష్ట్రాలలో రెండు మూడుసార్లు పర్యటించి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేవా? ఆయా రాష్ట్రాలలో ప్రత్యేకమైన పండుగలు, ఉత్సవాలు ఏమైనా జరుగబోతున్నాయా లేదా?ఒకవేళ జరిగే మాటయితే వాటి కోసం ఆయా రాష్ట్రాలలో సెలవు దినాలు ఎప్పుడెప్పుడు ఉంటాయి? , ఈవీఎం మెషిన్ల పరిస్థితి, రిటర్నింగ్ ఆఫీసర్ల ఎంపిక, శిక్షణ వంటివి పరిశీలించి, అవసరమైన సూచనలు చేసి వెళతారు. 

అన్నీ సవ్యంగా ఉంటే అప్పుడు సీఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంది. మళ్ళీ నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మరోసారి సీఈసీ అధికారుల బృందం రాష్ట్ర పర్యటన చేసి ఓటర్ల జాబితా, పోలింగ్ బూత్‌లురాష్ట్ర స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు తదితర అంశాలను పరిశీలిస్తుంది. 

తెలంగాణ ప్రభుత్వానికి జనవరి 16 వరకు గడువు ఉంది. అయితే తెలంగాణతో పాటు ఎన్నికలు నిర్వహించాల్సిన మిజోరాం శాసనసభకు ఈ ఏడాది డిసెంబర్‌ 17తో గడువు ముగుస్తుంది. ఆలోగా అక్కడ ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసి కొత్త ప్రభుత్వం ఏర్పడేలా చేయాల్సిన బాధ్యత సీఈసీదే. కనుక తెలంగాణ, మద్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు కూడా ఆలోగానే ఎన్నికలు నిర్వహించేందుకు సీఈసీ సన్నాహాలు చేస్తోంది. 

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు 2018, అక్టోబర్ 6న షెడ్యూల్ ప్రకటించి, డిసెంబర్‌ 7న పోలింగ్ నిర్వహించింది. కనుక ఈసారి కూడా ఇంచుమించు అదే తేదీలలో లేదా కాస్త ముందుగానే షెడ్యూల్ ప్రకటించి పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది.