మహా అయితే మరో మూడు నెలల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ సమయంలో సిఎం కేసీఆర్ ఇవాళ్ళ పట్నం మహేందర్ రెడ్డిని తన మంత్రివర్గంలోకి తీసుకోవడం విశేషం. ఇందుకోసం గురువారం మధ్యాహ్నం కేసీఆర్‌తో సహా మంత్రులు, సిఎస్ శాంతికుమారి తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని పలకరించి మాట్లాడక తప్పలేదు. ఆ తర్వాత ఆమె పట్నం చేత మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.
పట్నం మహేందర్ రెడ్డి తాండూరు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కనుక ఈసారి తనకు తప్పకుండా టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ కేసీఆర్ ఆ సీటుని సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కేటాయించారు. కనుక పట్నం మహేందర్ రెడ్డిని బుజ్జగించేందుకు కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు.
అయితే ఈ పదవి మూడు నెలల ముచ్చటే! ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగుతుంది. కనుక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకే పట్నంకు ఈ మంత్రి పదవి ఉంటుంది. ఒకవేళ బిఆర్ఎస్ గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చినా, పట్నం మహేందర్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యే కారు కనుక ఆయనకు మంత్రి పదవి లభించదు. ఒకవేళ కాంగ్రెస్ లేదా బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా పట్నం మూడు నెలల మంత్రిగా మిగిలిపోక తప్పదు.
ఇక ఈ ప్రమాణస్వీకారం కోసం కేసీఆర్, మంత్రులు అయిష్టంగానైనా రాజ్‌భవన్ గడప తొక్కక తప్పలేదు. అయితే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వారితో చాలా హుందాగా వ్యవహరిస్తూ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని జరిపించారు. కేవలం 20 నిమిషాలలోనే కేసీఆర్, మంత్రులు రాజ్‌భవన్ నుంచి బయటపడ్డారు!.