
బిఆర్ఎస్ పార్టీ 115 మంది అభ్యర్ధులను ప్రకటించి మళ్ళీ శాసనసభ ఎన్నికలకు సిద్దం అవుతుంటే, హైకోర్టు వరుసపెట్టి ఆ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తోంది. ఇటీవల కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసి ఆయన చేతిలో ఓడిపోయిన జలగం వెంకట్ రావుని ఎమ్మెల్యేగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇవాళ్ళ గద్వాల బిఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసి, ఆయన చేతిలో ఓడిపోయిన బిజెపి మహిళా నేత డికె అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. గత ఎన్నికలలో ఆయన తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్లు రుజువు అవడంతో తెలంగాణ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొంది.
హైకోర్టు ఆయనకు రూ.3 లక్షల జరిమానా కూడా విధించింది. దానిలో రూ.50 వేలు కోర్టు ఖర్చుల కింద డికె అరుణకు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో దాదాపు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగిన కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నవేళ ఆ పదవి కోల్పోగా, ఇంతకాలం పదవి లేకుండా ఉన్న డికె అరుణ ఎన్నికల ముందు ఎమ్మెల్యేగా మారారు.
తెలంగాణ హైకోర్టు మరో 20 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అర్హతపై విచారణ జరుపుతోంది. ఈ నెలాఖరులోగా ఈ కేసులన్నీ తేల్చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించినందున ఈ వారం రోజులలో మరి కొంతమంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది.