కేసీఆర్‌కు గుణపాఠం నేర్పిస్తాం: కూనంనేని

సీపీఐ, సీపీఎం నేతలు తెలంగాణ సిఎం కేసీఆర్‌ మీద భగభగమండిపోతున్నారు. మునుగోడు ఉపఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపించుకొనేందుకు తమ మద్దతు తీసుకొన్నప్పుడు భవిష్యత్‌లో కూడా కలిసి పనిచేస్తామనే అనుకొన్నామని, కానీ కేసీఆర్‌ తమను సంప్రదించకుండా ఏకపక్షంగా 115 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించి మోసం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. 

గురువారం హైదరాబాద్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, “కేసీఆర్‌ మమ్మల్ని వాడుకొని మోసం చేసినందుకు మేమేమీ కుమిలిపోవడం లేదు. మాకు హ్యాండిచ్చి కేసీఆర్‌ మంచి పనే చేశారు. మేమేమిటో, మా శక్తి సామర్ధ్యాలు ఏమిటో మేము నిరూపించి చూపే అవకాశం కల్పించారు. 

మేము ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10 వేలమంది చొప్పున రాష్ట్రంలో 30 నియోజకవర్గాలలో ఓటర్లను ప్రభావితం చేయగలము. ఇప్పుడు మాకు బిఆర్ఎస్ పార్టీతో సంబందం లేదు కనుక ఆ ఓట్లన్నీ మాతో కలిసి పనిచేసే పార్టీలకు పడేలా చేస్తాము. కేసీఆర్‌కు మాతో పొత్తు వద్దనుకొంటే అదే చెప్పాలి కానీ మేము ఇండియా కూటమిలో చేరామనే వంకతో మమ్మల్ని వదిలించుకోవడం మోసం చేయడంగానే భావిస్తున్నాము. 

కేసీఆరే ఏకపక్షంగా బిఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించి, మళ్ళీ మేము ఆయనను మోసం చేశామని తన పత్రికలో వ్రాయించుకోవడం ఇంకా దారుణం. కేసీఆర్‌ కనీస రాజకీయ విలువలు కూడా పాటించలేదు. అవసరమైనప్పుడు అందరినీ వాడుకొంటూ పైపైకి ఎదగాలనుకొంటారే తప్ప తన ఎదుగుదలకు తోడ్పడినవారిని కలుపుకుపోయే అలవాటు కేసీఆర్‌కు లేదు. మమ్మల్ని మోసం చేసినందుకు శాసనసభ ఎన్నికలలో మేము కేసీఆర్‌కు తగిన విధంగా బుద్ధి చెపుతాము. మా వ్యూహాలు ఎలా ఉంటాయో కేసీఆర్‌కు రుచి చూపిస్తాము,” అని హెచ్చరించారు. 

సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెపి ఒక్కటే గట్టిగా పట్టుబడుతుండేది. వామపక్షాలు కూడా కేసీఆర్‌కు గుర్తు చేస్తూండేవి కానీ దానికోసం పెద్దగా పట్టుబట్టలేదు. కానీ ఇప్పుడు కేసీఆర్‌ మీద కుతకుత ఉడికిపోతుండటంతో అవి కూడా తెలంగాణ విమోచన దినోత్సవం గురించి కేసీఆర్‌ను నిలదీస్తున్నాయి. 

కూనంనేని సాంబశివరావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన గొప్ప విషయం. కానీ కేసీఆర్‌తో సహా అన్ని పార్టీలు దానికి ప్రాధాన్యత లేకుండా చేశాయి. సెప్టెంబర్‌ 11 నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించి సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహిస్తాము,” అని తెలిపారు.