13.jpg)
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో కాంగ్రెస్ కార్యాలయంలో తన అర్దాంగి పద్మావతితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ, “ఈసారి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 70 సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈసారి 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీయే గెలుచుకొంటుంది. దీనిలో ఎటువంటి సందేహమూ లేదు. మాకున్న సమాచారం ప్రకారం అక్టోబర్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి, నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్దమవుతోంది
నేను హుజూర్ నగర్ నుంచి, నా భార్య పద్మావతి కోదాడ నుంచి శాసనసభ ఎన్నికలలో పోటీ చేయబోతున్నాము. ఇందుకోసం ఇప్పటికే ఇద్దరం పార్టీకి దరఖాస్తు చేసుకొన్నాము. పార్టీ అధిష్టానం ఆమోదం పొంది ఇద్దరం ఎన్నికలలో పోటీ చేస్తాము.
సిఎం కేసీఆర్ ఎప్పటిలాగే మళ్ళీ ప్రజలను మభ్యపెట్టేందుకు 115 మంది అభ్యర్ధులను ప్రకటించారు తప్ప వారిలో గెలిచేవారు కొద్ది మందే ఉన్నారు. రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వర్గ జనాభా 50 లక్షలు ఉంది. కానీ కేసీఆర్ ముదిరాజ్ వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. కనుక వారందరూ ఈ బిఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని కోరుతున్నాను.
తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్ నమ్మబలికారు. కానీ ఈ 9 ఏళ్ళలో కనీసం లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. నేను హౌసింగ్ మంత్రిగా ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టించి పేదలకు ఇచ్చాము. అవి మనుషులు ఉండేందుకు సరిపోవని, తాను ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తానని కేసీఆర్ గొప్పలు చెప్పాడు. కానీ ఇంతవరకు ఎన్ని లక్షలమందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇచ్చారో చెప్పగలరా? అని నేను అడుగుతున్నాను,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.