
తెలంగాణలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో మోత్కుపల్లి నర్సింహులు కూడా ఒకరు. టిడిపిలో ఉన్నప్పుడు మోత్కుపల్లి మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత టిడిపితో పాటు ఆయన రాజకీయ జీవితం కూడా క్రమంగా క్షీణించిపోయింది. టిడిపిని నుంచి బహిష్కరింపబడిన తర్వాత కేసీఆర్కు దగ్గరయ్యి 2018 ముందస్తు ఎన్నికలలో ఆలేరు నుంచి మళ్ళీ టికెట్ పొందాలనుకొన్నారు. కానీ కుదరకపోవడంతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.
ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పధకం ప్రవేశపెడుతున్నప్పుడు దానిపై చర్చించేందుకు సిఎం కేసీఆర్ మోత్కుపల్లిని కూడా ఆహ్వానించడంతో ఆయన చాలా సంతోషంగా వెళ్ళి దానిలో పాల్గొన్నారు. కానీ ఆ తర్వాత కేసీఆర్ మళ్ళీ ఆయనను పట్టించుకోలేదు. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.
అయినప్పటికీ త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో తనకు ఆలేరు నుంచి తప్పక టికెట్ ఇస్తారని ఆశగా ఎదురుచూశారు. కానీ కేసీఆర్ ఈసారి కూడా ఆలేరు టికెట్ గొంగిడి సునీతకే ఇవ్వడంతో మోత్కుపల్లి తీవ్ర నిరాశ చెందారు. ఈ నేపధ్యంలో నేడు యాదగిరి గుట్టలో తన అనుచరులతో ఆత్మీయసమావేశం కానున్నారు. వారితో చర్చించి భవిష్య కార్యాచరణ ప్రకటించనున్నారు.