చంద్రయానా... అంటే ఏమిటి? బిహార్‌ సిఎం

సరిగ్గా మరో రెండు గంటలలో చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంలో ఉపరితలంపై దిగబోతోంది. దీని గురించి యావత్ భారతీయులతో పాటు ప్రపంచదేశాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, ఇంతవరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్ చేయగలిగాయి.

గత ఏడాది ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 ప్రయోగం ఈ చివరి దశలోనే సాంకేతిక సమస్య కారణంగా విఫలమైంది. కానీ ఈసారి నూటికి నూరుశాతం విక్రమ్ ల్యాండ్ అవుతుందని ఇస్రో ఛైర్మన్‌ సోమనాద్‌తో సహా అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కనుక భారతదేశానికి, ఇస్రోకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రయోగం కోసం యావత్ ప్రపంచ దేశాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్‌ కాలమాన ప్రకారం ఈరోజు సాయంత్రం 5.47 నుంచి ఈ ల్యాండింగ్ ప్రక్రియ మొదలై సరిగ్గా 6.04 గంటలకు చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండ్ అవుతుంది. కనుక ఇప్పటికే కోట్లాదిమంది భారతీయులు టీవీల ముందు కూర్చొని చంద్రయాన్-3 ప్రయోగం గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు కూడా.

కనుక మనదేశంలో చంద్రయాన్-3 ప్రయోగం గురించి తెలియనివారులేరంటే అతిశయోక్తి కాదు. అయితే బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కి విలేఖరులు ఈ విషయం చెప్పి స్పందించమని అడిగినప్పుడు, చంద్రయాన్ అంటే ఏమిటి అన్నట్లు ప్రశ్నార్ధకంగా మొహం పెట్టి పక్కనే ఉన్న మరో నాయకుడిని అడిగి తెలుసుకొన్నారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రాలలో ఒకటైన బిహార్‌కు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నితీశ్ కుమార్‌, అవకాశం లభిస్తే ప్రధానమంత్రి పదవి చేపట్టాలని కలలు కంటున్నారు. ఆయనకి చంద్రయాన్-3 ప్రయోగం గురించి తెలియదంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వీడియో చూస్తే మీకే అర్దమవుతుంది.