కరోనా, లాక్ డౌన్ సమయంలో వెలుగులోకి వచ్చిన తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు, ఆ తర్వాత వివాదాస్పద వ్యవహారశైలితో విమర్శలు మూటగట్టుకొన్నారు. అవన్నీ ఒక ఎత్తయితే, కొత్తగూడెం నుంచి శాసనసభకు పోటీ చేయబోతున్నట్లు చెప్పుకొంటూ గూడెంలో ఆయన చేసిన హడావుడి ఒక్కటీ మరో ఎత్తు. చాలాకాలంగా ఆయన తన పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి దానితో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కొత్తగూడెం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టాలని ఆయన కలలు కన్నారు. గుళ్ళుగోపురాలు తిరిగారు. గూడెంలో సంబురాలు నిర్వహించారు. వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. మొన్న కేసీఆర్ అభ్యర్ధుల పేర్లు ప్రకటించే ముందు శ్రీనివాసరావు అనుచరులను వెంటేసుకొని కొత్తగూడెంలో ఇంటింటికీ వెళ్ళి మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, కరపత్రాలు పంచిపెట్టి అందరినీ తనకే ఓట్లు వేసి గెలిపించాలని వేడుకొన్నారు. తనను గెలిపిస్తే కొత్తగూడెం రూపురేఖలే మార్చేస్తానని హామీ ఇచ్చారు.
టికెట్ కోసం ఓసారి అందరి ముందు కేసీఆర్ కాళ్ళకు మొక్కారు కూడా. అయితే కేసీఆర్ ఆయన మొర ఆలకించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకే టికెట్ కేటాయించారు. దీంతో డాక్టర్ శ్రీనివాసరావు అందరిలో నవ్వులపాలయ్యారు.
ఒకవేళ వేరే పార్టీలో చేరి టికెట్ సంపాదించుకోవాలంటే ముందుగా ఉద్యోగానికి రాజీనామా చేయాలి. అంత రిస్క్ తీసుకొన్నా తప్పకుండా గెలుస్తారనే నమ్మకం లేదు. కనుక ఇక ఈ హడావుడి చాలించి మళ్ళీ బుద్ధిగా ఉద్యోగం చేసుకోకతప్పదు.