మహిళా రిజర్వేషన్స్ గురించి మాట్లాడవేమి కవితమ్మా?

చట్టసభలలో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వేషన్ చేయాలని కోరుతూ బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో రెండు రోజులు ధర్నాలు చేసిన సంగతి ఆమె మరిచిపోయారు. కానీ ప్రతిపక్షాలు మరిచిపోలేదు. ఆమె తండ్రి, సిఎం కేసీఆర్‌ నిన్న ప్రకటించిన 115 స్థానాలకు కేవలం ఏడు సీట్లు మాత్రమే మహిళలకు కేటాయించడంతో, ప్రతిపక్షాలన్నీ కల్వకుంట్ల కవితని మహిళా రిజర్వేషన్స్ గురించి ప్రశ్నిస్తున్నాయి. అప్పుడు మహిళా రిజర్వేషన్స్ కోసం ఢిల్లీలో ధర్నాలు చేసిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్‌, బిజెపిలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు ఆమె ప్రగతి భవన్‌ ఎదుట కూర్చొని మహిళా రిజర్వేషన్స్ కోసం ధర్నా చేయాలని సూచించాయి. 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందిస్తూ, “33 శాతం రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో పార్టీలు కలిసి రావాలని చిలక పలుకులు పలుకుతున్న కవితమ్మ.. ఎక్కడ పాయె మీ చిత్తశుద్ధి? 115 సీట్లలో 7 స్థానాలు ఇచ్చిన మీకు చిత్తశుద్ది ఉన్నట్లా? ఆకాశం, అధికారం సగం సగం అని శ్రీరంగ నీతులు చెప్పిన మీరే 6 శాతం ఇస్తే చిత్తశుద్ధి చూపినట్లా?

కవితమ్మ "Be the change you want to see". ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. రాష్ట్రంలో సీట్లిచ్చే దమ్ముండాలి.తెలంగాణ జనాభాలో 50 శాతం మహిళలున్నా క్యాబినెట్ లోనూ ప్రాధాన్యత దక్కలే. లిక్కర్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ ల గురించి కాకుండా మీ నాన్నతో మాట్లాడి క్యాబినెట్ లో, పెద్దల సభలో, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ ఇప్పించు. 

లిక్కర్ స్కాం పక్కదారి పట్టించేందుకు ఎత్తుకున్న నినాదమే 33 శాతం రిజర్వేషన్లు తప్ప.. మీకెక్కడిది మహిళల పట్ల చిత్తశుద్ధి. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల పైన స్పందించిన పాపాన పోలేదు.. రాజధాని నడిబొడ్డున ఆడపడుచులపై అత్యాచారాలు జరుగుతున్నా, మీ పోలీసులు మహిళా రైతులకు బేడీలు వేసినా, స్టేషన్ లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించినా మీకు పట్టదు.. మీ దృష్టిలో మహిళలు వ్రతాలు చేసుకోవడానికి, ఓటు బ్యాంకుగా మాత్రమే పనికొస్తారు కానీ రాజకీయాలకు కాదు.. . 

నిజంగా మీకు మహిళా రిజర్వేషన్లపై గౌరవం ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో 33 శాతం అమలు చేయించాలి. సిట్టింగులకు ఇచ్చిన సీట్లలో 33 స్థానాలు మహిళా అభ్యర్థులకు అవకాశం ఇప్పించి కవితమ్మ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి,” అంటూ చాలా ఘాటుగా ట్వీట్‌ చేశారు.