వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటుకి ఎన్నికల బ్రేక్?

ఇరుగు పొరుగు రాష్ట్రాలలో నాలుగైదు విమానాశ్రయాలు ఉండగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ మొత్తానికి శంషాబాద్‌ విమానాశ్రయం ఒక్కటి మాత్రమే ఉండటం ఆశ్చర్యకరమే. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను చాలాకాలం క్రితమే గుర్తించి, ఎయిర్ పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చేత రాష్ట్రంలో సర్వే చేయించింది. ఏఏఐ అధ్యయనం చేసి రాష్ట్రంలో ఆరు ప్రాంతాలను విమానాశ్రయం ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూలంగా ఉందని గుర్తించింది. 

వాటిలో వరంగల్‌ కూడా ఒకటి. వరంగల్‌ జిల్లా మామునూరులో 1930లోనే చివరి నిజాం నవాబు 706 ఎకరాలలో ఓ విమానాశ్రయం ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆ ఎయిర్ పోర్ట్ మూతపడింది. అక్కడే మరో 400 ఎకరాలు సేకరించి అందజేస్తే విమానాశ్రయం నిర్మిస్తామని ఏఏఐ చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో 253 ఎకరాలు సేకరించి అప్పగించాలని నిర్ణయించింది. 

ప్రతిపాదిత విమానాశ్రయం పక్కనే మామునూరు డెయిరీ ఫారంకు చెందిన 50 ఏకరాలతో పాటు పక్కనే ఉన్న రైతులకు చెందిన 210 ఎకరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విమానాశ్రయం నిర్మాణం కంటే ఈ భూసేకరణ ప్రక్రియే చాలా క్లిష్టమైనదని చెపొచ్చు. కనుక భూసేకరణ పూర్తయితే మామునూరులో విమానాశ్రయం వచ్చేసిన్నట్లే. 

కానీ నేడో రేపో ఎన్నికల గంట మొగబోతోంది. ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగులు అందరూ ఎన్నికల ప్రక్రియతో బిజీ అయిపోతారు. కనుక ఎన్నికల ప్రక్రియ ముగిసి, రాష్ట్రంలో మళ్ళీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు వరంగల్‌ విమానాశ్రయం కోసం భూసేకరణ పనులు మందకొడిగానే సాగవచ్చు.