మల్కాజిగిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మంగళవారం తిరుమలలో శ్రీవారిని మరోసారి దర్శించుకొన్న తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ, “నిన్న నేను అన్నమాటలకు కట్టుబడి ఉన్నాను. నేను పార్టీ గురించి మాట్లాడలేదు. పార్టీలో ఓ వ్యక్తి తీరు గురించి మాత్రమే మాట్లాడాను. నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను. పెట్టలేదు కూడా. కానీ ఎవరైనా నాజోలికి వస్తే వారిని విడిచిపెట్టను.
నాకు, నా కుమారుడు రోహిత్‌కి టికెట్స్ ఇస్తే రెండు సీట్లు గెలుచుకొంటామని చెపితే, పార్టీలో ఓ వ్యక్తి (హరీష్ రావు) నా కుమారుడుకి టికెట్ రాకుండా అడ్డుపడ్డారు. అందుకే నేను ఆయన గురించి మాట్లాడవలసి వచ్చింది. అందుకు నన్ను పార్టీలో నుంచి బయటకు పంపిస్తానంటే నేనేమీ భయపడేది లేదు.
బయటకు వెళ్ళినా నేను మల్కాజిగిరి నుంచి, నా కుమారుడు మెదక్ నుంచి పోటీ చేసి తీరుతాము. ఇందులో సందేహం లేదు. నాకు పార్టీ కంటే నా కుమారుడే ముఖ్యం. నేను హైదరాబాద్ చేరుకోగానే నా కార్యాచరణ ప్రకటిస్తా,” అని అన్నారు.
మంత్రి హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలకు నీరసంగా మల్కాజిగిరి నియోజకవర్గంతో సహా రాష్ట్రంలో పలుచోట్ల బిఆర్ఎస్ కార్యకర్తలు మైనంపల్లి హన్మంతరావు దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసనలు తెలుపుతున్నారు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా ఈసారి ఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు.
మైనంపల్లి హన్మంతరావు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో టికెట్స్ ఖరారు చేసుకొన్నారని అందుకే మంత్రి హరీష్ రావుని ఉద్దేశ్యించి అంత తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.