ఘోషామహల్ అభ్యర్ధిని అందుకే ప్రకటించలేదు: రాజాసింగ్‌

సిఎం కేసీఆర్‌ నిన్న ప్రకటించిన 115 మంది బిఆర్ఎస్ అభ్యర్ధులలో ఘోషామహల్ నియోజకవర్గానికి అభ్యర్ధిని ప్రకటించలేదు. దానిపై ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “అక్కడి నుంచి ఎవరిని బరిలో దింపాలో మజ్లీస్‌ పార్టీయే నిర్ణయిస్తుంది. అందుకే కేసీఆర్‌ ఘోషామహల్ అభ్యర్ధిని ప్రకటిచలేదు. గత ఎన్నికలలో ప్రేమ్ సింగ్‌ రాథోడ్ పేరును మజ్లీస్‌ పార్టీ సూచిస్తే కేసీఆర్‌ ఆయనకే టికెట్‌ ఖరారు చేశారు. ఈసారి కూడా అలాగే జరుగుతుంది. 

బిఆర్ఎస్ డమ్మీ అభ్యర్ధిగా ఎవరు పోటీ చేసినప్పటికీ ఈసారి కూడా నేనే బిజెపి అభ్యర్ధిగా ఘోషామహల్ నుంచి పోటీ చేయబోతున్నాను. నాకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, లక్ష్మణ్ అందరి ఆశీర్వాదాలు నాకున్నాయి. కనుక ఈసారి నాకే టికెట్‌ లభించనుంది. కనుక ఘోషామహల్లో బిజెపి కార్యకర్తలందరూ సిద్దంగా ఉండాలి. ఈసారి అందరం కలిసి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పీకేసి తెలంగాణలో మన బిజెపి ప్రభుత్వం ఏర్పాటుచేసుకొందాము,” అని అన్నారు. 

అయితే బిజెపి అధిష్టానం నేటికీ రాజాసింగ్‌పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయలేదు. పార్టీలో నుంచి సస్పెండ్ అయిన తనకు టికెట్‌ వస్తుందని రాజాసింగ్‌ నమ్మకంగా చెపుతుండటం, రాష్ట్ర బిజెపి పెద్దల ఆశీర్వాదాలు తనకున్నాయని చెప్పడం గమనిస్తే వారి ద్వారా అధిష్టానానికి నచ్చజెప్పుకొని మళ్ళీ పార్టీలోకి రావాలనుకొంటున్నారేమో?