బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అప్పుడే జంప్!

సిఎం కేసీఆర్‌ నిన్న 115 మంది పార్టీ అభ్యర్ధులను ఒకేసారి ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాలలో మళ్ళీ ఒక్కసారిగా వేడి పెరిగింది. ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో మళ్ళీ టికెట్లు లభించని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.

అయితే వారిలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోబోబోతున్నారు.

సోమవారం రాత్రే ఆమె భర్త శ్యామ్ నాయక్ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. రేఖా నాయక్ కూడా కాంగ్రెస్‌లో చేరిపోవడం ఖాయమే కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు కనుక ఇప్పుడే చేరితే అనర్హత వేటు పడుతుంది కనుక ఆమె ఎన్నికల గంట మ్రోగిన తర్వాత తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.

శ్యామ్ నాయక్‌కు ఆసిఫాబాద్, రేఖా నాయక్‌కు మళ్ళీ ఖానాపూర్ సీట్లు ఇచ్చేందుకు రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బొధ్ ఎమ్మెల్యే బాపురావు రాథోడ్‌లకు కూడా కేసీఆర్‌ టికెట్‌ ఇవ్వలేదు. కనుక వారు కూడా కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యే అవకాశం ఉందనే భావించవచ్చు. 

ఇక మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకి మళ్ళీ టికెట్‌ లభించినప్పటికీ, ఆయన మంత్రి హరీష్‌ రావుని ఉద్దేశ్యించి చాలా చులకనగా మాట్లాడారు. కనుక ఆయనను ‘తీసి బయటపడేస్తాం’ అని సిఎం కేసీఆర్‌ నిన్న ప్రెస్‌మీట్‌లోనే చెప్పేశారు. కనుక ఆయన తన కుమారుడు రోహిత్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వారికి మల్కాజిగిరి, మెదక్‌ సీట్లు ఇస్తామని రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.