త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల తొలి జాబితాను సిఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం విడుదల చేయనున్నారు. తొలిజాబితాలో 80-90 మంది అభ్యర్ధుల పేర్లు ఉండవచ్చని తెలుస్తోంది. అలాగే స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, మహబూబాబాద్, ఖానాపూర్‌తో సహా పలు నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెట్టి వేరేవారికి టికెట్లు ఖరారు చేసిన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి హరీష్ రావులను కలిసి తమకు టికెట్ దక్కేలా చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వెళ్ళి కల్వకుంట్ల కవితని కలిసి తమ ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ ఖరారు చేయించాలని అభ్యర్ధించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇంకా పలువురు ఆశావాహులు కూడా నిన్న చివరి ప్రయత్నంగా కల్వకుంట్ల కవితని కలిసి టికెట్ గురించి మాట్లాడారు. వారి వినతులను సిఎం కేసీఆర్‌కు తెలియజేస్తాను కానీ కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకొన్నా అందరూ కట్టుబడి ఉండాలని ఆమె వారికి సూచించారు.
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనకు టికెట్ కేటాయించాలని కోరుకొంటూ సర్వమత ప్రార్ధనలు నిర్వహించి రాజశ్యామల యాగం చేయగా, జనగామ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన అనుచరులతో కలిసి గుడికి వెళ్ళి పూజలు చేసి మళ్ళీ తనకే టికెట్ దక్కాలని కోరుకొన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ స్థానిక అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. సిఎం కేసీఆర్ తనకు తప్పకుండా టికెట్ ఇస్తారని కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకొంటూ పూజలు చేశానని చెప్పారు.