నిర్మల్ మాస్టర్ ప్లాన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 220ని రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే, బిజెపి సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గత 5 రోజులుగా నిర్మల్ పట్టణంలో తన నివాసంలోనే ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు ఆయన ఇంట్లోకి ప్రవేశించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులను అడ్డుకొనేందుకు, బిజెపి కార్యకర్తలు ప్రయత్నించడంతో కాసేపు వారి మద్య తోపులాటలు జరిగాయి. పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు.
తనను ఆసుపత్రిలో చేర్చినా జీవో 220 రద్దు చేసేవరకు ఆమరణ నిరాహారదీక్ష కొనసాగిస్తానని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. వైద్యులు ఆయనకు నచ్చజెప్పి సెలైన్ ఎక్కించిన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, డికె అరుణ తదితరులు ఆయనకు సంఘీభావం తెలిపేందుకు నిర్మల్ బయలుదేరగా దారిలోనే పోలీసులు వారిని అడ్డుకొని వెనక్కు తిప్పిపంపించేశారు.
బిజెపికి పోటీగా బిఆర్ఎస్ కార్యకర్తలు నేడు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు సిద్దమవుతుండటంతో నిర్మల్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలో ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరుగకుండా భారీగా పోలీసులను మోహరించారు.