హైదరాబాద్‌లో 36వ ఫ్లైఓవర్‌... స్టీల్‌ బ్రిడ్జ్ ప్రారంభం

దక్షిణ భారతదేశంలోనే అతి పొడవైన (2.63 కిమీ) ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ శనివారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభించారు. నగరంలో లోయర్ ట్యాంక్‌బండ్‌ వద్ద ఇందిరాపార్కు చౌరస్తా నుంచి వీఎస్టీ చౌరస్తా వరకు 2.62 కిమీ పొడవు గల ఫ్లైఓవర్‌ నిర్మాణానికి రూ.450 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. 

ఇది మిగిలిన ఫ్లైఓవర్లకు పూర్తి భిన్నమైనది. ఈ ప్రాంతంలో భూసేకరణ చేయడం వలన చాలా మంది నష్టపోతారు. పైగా ఈ ప్రాంతం నగరం నడిబొడ్డున ఉన్నందున భూసేకరణతో ఫ్లైఓవర్‌ నిర్మాణవ్యయం భారీగా పెరిగిపోతుంది. కనుక భూసేకరణ అవసరం లేకుండా తొలిసారిగా పూర్తిగా ఉక్కు (స్టీల్‌)తో ఈ ఫ్లైఓవర్‌ని నిర్మించారు. నాలుగు లైన్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ని నిలబెట్టే 81 పిల్లర్స్ (స్థంభాలు) కూడా ఉక్కుతోనే తయారుచేసారు. 

ఈ మార్గంలో రోజుకి సుమారు లక్ష వాహనాలు ప్రయాణిస్తున్నాయి. కనుక ఇందిరాపార్క్ జంక్షన్‌, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఉస్మానియా యూనివర్సిటీ, విద్యానగర్, వీఎస్టీ మద్య నిత్యం రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో వీఎస్టీ నుంచి కేవలం 4 నిమిషాలలోనే ట్యాంక్‌బండ్‌ చేరుకోవచ్చు. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌ నగరంలోనే దీంతో కలిపి ఇప్పటివరకు 36 ఫ్లైఓవర్లు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాము. ఈ ఫ్లైఓవర్‌కు నాయిని నరిసింహారెడ్డి పేరు పెట్టాలని సిఎం కేసీఆర్‌ సూచించారు. 

రాబోయే రోజుల్లో లోయర్ ట్యాంక్‌బండ్‌, అప్పర్ ట్యాంక్‌బండ్‌, ఇందిరాపార్కులను మరింత అందంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతాము. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు... రాష్ట్రంలో అన్ని జిల్లాలలో సమానంగా అభివృద్ధిచేస్తున్నాము. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలనుకొంటే ప్రజలు మళ్ళీ బిఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేసి గెలిపించాలి. కొందరు మతం పేరుతో ప్రజల మద్య చిచ్చురాజేసి వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని కుట్రలు చేస్తున్నారు. కానీ ముచ్చటగా మూడోసారి కూడా కేసీఆరే విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యి హ్యాట్రిక్ సాధించడం ఖాయం,” అని అన్నారు.