ప్రజాగాయకుడు గద్దర్ చివరి రోజులలో కాంగ్రెస్ పార్టీకి చేరువైన సంగతి తెలిసిందే. ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి చాలా ఆలస్యంగా ప్రవేశించడం వలన చట్టసభలలో అడుగుపెట్టలేకపోయారు. కనుక ఆయన అభ్యర్ధన మేరకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయన కుమారుడుసూర్య కిరణ్‌ను సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేయించాలనుకొంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. గద్దర్ పట్ల ప్రజలలోనే కాక పార్టీలో కూడా అందరికీ సానుభూతి ఉంది కనుక సూర్య కిరణ్ అభ్యర్ధిత్వానికి ఎవరూ అభ్యంతరం చెప్పకపోవచ్చు.
గద్దర్ కుమారుడు సూర్య కిరణ్‌ను శాసనసభ ఎన్నికల బరిలో దింపితే ప్రజలు గద్దర్ మీద సానుభూతి, అభిమానంతో తప్పకుండా గెలిపిస్తారని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఏ కారణం చేతైనా శాసనసభ ఎన్నికలలో పోటీ చేయించలేకపోతే తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికలలో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేయించలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
శాసనసభ ఎన్నికలలో పోటీ చేయాలనుకొనేవారి నుంచి శుక్రవారం నుంచే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో దరఖాస్తులు స్వీకరించడం మొదలుపెట్టింది. ఒకవేళ సూర్య కిరణ్ కూడా దరఖాస్తు చేసుకొంటే రేవంత్ రెడ్డి ఆయనను ఎన్నికల బరిలో దింపబోతున్నట్లే భావించవచ్చు.