20.jpg)
తెలంగాణ బిజెపిని విజయపదంవైపు నడిపించిన బండి సంజయ్‌ని సరిగ్గా ఎన్నికలకు ముందు అధ్యక్ష పదవి నుంచి తొలగించుకొని బిజెపి రాజకీయంగా ఆత్మహత్య చేసుకొందని నేటికీ అందరూ భావిస్తున్నారు. బండి సంజయ్ కూడా కొన్ని రోజులు తీవ్ర నిరాశనిస్పృహలకు గురయ్యారు. కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడటంతో ఆయనను పార్టీ జాతీయకార్యదర్శిగా నియమించింది.
ఆ హోదాలో ఆయన తొలిసారిగా ఈనెల 21న ఆంధ్రప్రదేశ్ (విజయవాడ)కు వెళుతున్నారు. ఆ రాష్ట్రంలో ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించడం, ఏపీ బిజెపిని బలోపేతం చేసేందుకు ఆ రాష్ట్ర బిజెపి నేతలతో చర్చించి వారికి మార్గదర్శనం చేసే బాధ్యతలను పార్టీ అధిష్టానం బండి సంజయ్‌కి అప్పగించిన్నట్లు తెలుస్తోంది.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్ ఏపీ బిజెపి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే కేంద్రమంత్రిగా పని ఒత్తిడి ఎక్కువ ఉండటం వలన ఆయన ఏపీ బిజెపి ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పుకోవాలనుకొంటున్నారు. కనుక బండి సంజయ్‌కే ఆ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది చివరిలోగా తెలంగాణతో పాటు మద్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలలో కూడా శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. కనుక ఈ 5 రాష్ట్రాలలో కూడా బిజెపీని బలోపేతం చేసే బాధ్యత బండి సంజయ్‌కే అప్పగించనున్నట్లు తెలుస్తోంది. కానీ బండి సంజయ్ తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావాలని పట్టుదలగా ఉన్నారు. కనుక ఆయన తెలంగాణపైనే ఎక్కువగా దృష్టి పెట్టవచ్చు.