తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్ధులకు మొదటే పరీక్ష!

నేడో రేపో సిఎం కేసీఆర్‌ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించబోతున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా శాసనసభ ఎన్నికలలో పోటీ చేయాలనుకొంటున్న అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం మొదలుపెట్టింది. హైదరాబాద్‌, గాంధీ భవన్‌లో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ గురించి వివరించారు. 

“నేటి నుంచి ఈ నెల 25వరకు రాష్ట్ర కాంగ్రెస్‌లో సభ్యత్వమున్న ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు ఓసీ, బీసీ అభ్యర్ధులైతే రూ.50 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులైతే రూ.25 వేలు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. టికెట్‌ లభించినా లభించకపోయినా ఈ సొమ్ము వాపసు ఇవ్వబడదు. ఈ సొమ్ముని పార్టీ కార్యక్రమాలకు వినియోగిస్తాము. 

ఈ నెల 25 తర్వాత దరఖాస్తులని పరిశీలించి, దరఖాస్తుదారుల బలాబలాలు, ప్రజాధరణపై సర్వే చేయించి తెలుసుకొంటాము. ఆ తర్వాత ఆయా నియోజకవర్గాలలో సామాజిక సమీకరణాలు, అభ్యర్ధుల బలాబలాలను అంచనా వేసి స్క్రీనింగ్ కమిటీకి పంపిస్తాము. స్కీనింగ్ కమిటీ పరిశీలించి దానిలో నుంచి అభ్యర్ధుల షార్ట్ లిస్ట్ సిద్దం చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపిస్తుంది. అది పరిశీలించి అభ్యర్ధులను ఖరారు చేస్తుంది. 

అభ్యర్ధుల ప్రక్రియ పూర్తిపారదర్శకంగా సాగుతుంది. ఎవరి ఒత్తిళ్ళు పనిచేయవు. కనుక అభ్యర్ధుల ఎంపికపై మీడియాలో వచ్చే ఊహాగానాలను లేదా పుకార్లను నమ్మవద్దని దరఖాస్తుచేసుకొన్నవారిని, పార్టీ క్యాడర్‌ని కూడా కోరుతున్నాము,” అని రేవంత్‌ రెడ్డి చెప్పారు.        

ఈసారి దరఖాస్తుతో పాటు 25-50 వేలు ఫీజు వసూలు చేయాలనే నిర్ణయంతో చాలామందిని ఫిల్టర్ చేసిన్నట్లే. శాసనసభ ఎన్నికలలో ఒక్కో అభ్యర్ధి కనీసం రూ.4-5 కోట్లు పైనే ఖర్చు చేయాల్సి రావచ్చు. కనుక ఎన్నికల బరిలో దిగాలనుకొనేవారికి అంత స్థోమత ఉందో లేదో ముందే తెలుసుకోవడం మంచి ఆలోచనే. గత పదేళ్ళుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండిపోయినందున పార్టీ నిధులు కరిగిపోయాయి. కనుక దరఖాస్తుల ద్వారా వచ్చే భారీ ఆదాయం కాంగ్రెస్‌కు ఉపశమనం కలిగించచ్చు.