ఈరోజూ ఉదయం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసం వద్ద కాసేపు హైడ్రామా సాగింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం ఉదయం గజ్వేల్ పర్యటనకు బయలుదేరుతుండగా పోలీసులు వచ్చి ఆమెను అడ్డుకొని, ఆమె పర్యటనకు అనుమతి లేదని చెప్పారు. కనుక ఆమెను గృహ నిర్బందం చేస్తున్నట్లు తెలియజేశారు.
ఓ రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా తాను గజ్వేల్ ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు వెళుతున్నానని, దీనికి పోలీసులు ఎందుకు అభ్యంతరం చెపుతున్నారంటూ ఆమె వారితో వాదించారు. తాను గజ్వేల్ వెళ్ళి అక్కడి ప్రజలతో మాట్లాడి తిరిగి వచ్చేస్తానని, తన పర్యటనలో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించనని హామీ ఇస్తున్నానని కనుక తనను అనుమతించాలని ఆమె పదేపదే కోరారు. కానీ పోలీసులు నిరాకరించడంతో ఆమె స్వయంగా వారందరికీ హారతి ఇచ్చి, అక్కడే సాయంత్రం వరకు నిరాహారదీక్ష చేసేందుకు కూర్చోన్నారు.