హైదరాబాద్‌లో స్టీల్‌ బ్రిడ్జి... ఆగస్ట్ 19న ప్రారంభోత్సవం

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తొమ్మిదిన్నరేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ నగరంలో 32 ఫ్లైఓవర్లు నిర్మించింది. ఇప్పుడు పూర్తిగా ఉక్కుతో నిర్మించిన మరో ఫ్లైఓవర్‌ను ఈనెల 19న ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. 

రూ.450 కోట్లు వ్యయంతో లోయర్ ట్యాంక్‌బండ్‌ వద్ద ఇందిరాపార్కు చౌరస్తా నుంచి వీఎస్టీ చౌరస్తా వరకు 2.63 కిమీ పొడవు గల ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వస్తే ఇందిరాపార్క్ జంక్షన్‌, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఉస్మానియా యూనివర్సిటీ, విద్యానగర్, వీఎస్టీ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించేవారికి ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి. వీఎస్టీ నుంచి కేవలం 4 నిమిషాలలోనే ట్యాంక్‌బండ్‌ చేరుకోవచ్చు.

ఈ మార్గంలో భూసేకరణ చేయడం చాలా కష్టం కనుక భూసేకరణ అవసరం లేకుండా ఈ ఫ్లైఓవర్‌ నిర్మించేందుకు తొలిసారిగా పూర్తిగా ఉక్కు (స్టీల్‌)తో దీనిని నిర్మించారు. అయితే దీనిని కూడా నాలుగు లైన్లతో సువిశాలంగా నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌లో మొత్తం 81 స్టీల్‌ పిల్లర్లు వేసారు. ఈ ఫ్లైఓవర్‌ కోసం 12,316 టన్నుల స్టీల్ వినియోగించారు. రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి స్టీల్‌ బ్రిడ్జిగా నిలువబోతోంది.