1.jpg)
తెలంగాణ శాసనసభకు ఇక నుంచి ఏ రోజైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చు. కనుక బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ మూడు పార్టీలు అభ్యర్ధుల జాబితాలపై కసరత్తు పూర్తిచేసి తొలిజాబితాలు విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా ముందుగా బిఆర్ఎస్ పార్టీయే తొలి జాబితా విడుదలచేయబోతోంది.
రేపు శుక్రవారంతో అధిక శ్రావణ మాసం ముగుస్తుంది. శనివారం (తదియ) నుంచి శ్రావణమాసం మొదలవుతుంది. కనుక అదే రోజున 80-90 స్థానాలకు అభ్యర్ధుల తొలిజాబితాను కేసీఆర్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ మెదక్ పర్యటనకు, మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్ళవలసి ఉండగా తొలిజాబితా విడుదల కోసం వాటిని వాయిదా వేసుకొన్నారని తెలుస్తోంది.
ఒకవేళ ఏ కారణం చేతైనా శనివారం తొలిజాబితా ప్రకటించలేకపోతే ఈనెల 25, 26, 27 (నవమి దశమి, ఏకాదశి) మూడు చాలా మంచిరోజులే. వాటిలో 25 తొలి శ్రావణ శుక్రవారం కనుక ఆరోజున జాబితా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేకుంటే 26,27 తేదీలలో తొలిజాబితా విడుదల చేయడం ఖాయమే.
రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపిలు కూడా అభ్యర్ధులను దాదాపు ఖరారు చేసుకొని ఆ జాబితాలను తమ అధిష్టానం ఆమోదం కొరకు పంపిపిన్నట్లు తెలుస్తోంది.