
గత ఎన్నికలలో తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుని హైకోర్టు ఎమ్మెల్యేగా అనర్హుడని, ఆయనతో పోటీ పడి ఓడిపోయిన జలగం వెంకట్రావుని ఎమ్మెల్యేగా పరిగణించాలని ఆదేశించడం, దాంతో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడం తెలిసిందే.
త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో కూడా తానే కొత్తగూడెం నుంచి మళ్ళీ పోటీ చేస్తానని, సిఎం కేసీఆర్ తనకు మళ్ళీ టికెట్ ఖరారు చేశారని వనమా వెంకటేశ్వరరావు నిన్న అధికారుల సమావేశంలో చెప్పారు. మరో 25 రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతోంది కనుక ఆలోగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. తాను సిఎం కేసీఆర్‌తో మాట్లాడి కొత్తగూడెం పురపాలక సంఘానికి రూ.115 కోట్లు, పాల్వంచకు రూ.100 కోట్లు నిధులు మంజూరు చేయించానని, కనుక వాటితో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఒకవేళ కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టకపోతే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను వనమా వెంకటేశ్వరరావు ఆదేశించారు.