సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్దపడుతున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదివరకు కూడా చాలాసార్లు ఇటువంటి ఊహాగానాలు వినిపిస్తే ఆయన వెంటనే వాటిని ఖండించేవారు. కానీ ఇప్పుడు స్పందించకపోవడంతో ఆయన బిఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయమే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల సమయంలోనే ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు కానీ టిఆర్ఎస్కు ఆయన అవసరం లేకపోవడంతో అప్పుడు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ అభ్యర్ధిగానే పోటీ చేసి గెలిచారు. అయితే జగ్గారెడ్డి పిసిసి అధ్యక్ష పదవి ఆశించి భంగపడినప్పటి నుంచి రేవంత్ రెడ్డిపై అప్పుడప్పుడు విమర్శలు గుప్పిస్తూ తన అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
ఇందుకు పార్టీ అధిష్టానం ఆయనకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో హర్ట్ అయ్యారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్న తనను కాదని టిడిపిలో నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం ప్రాధాన్యం ఇస్తుండటంతో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి బిఆర్ఎస్ పార్టీలో చేరాలని భావిస్తున్నారు.
గత రెండు ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో తిరుగు ఉండేది కాదు. కానీ ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపి, ఇంకా ఇతర రాజకీయశక్తులు బిఆర్ఎస్ని ఓడించేందుకు చురుకుగా పావులు కదుపుతున్నాయి. కనుక కేసీఆర్ ప్రభంజనాన్ని కూడా తట్టుకొని సంగారెడ్డి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకొని అక్కడి నుంచే బిఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో దింపితే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిలో నిజమెంతో అబద్దమెంతో త్వరలోనే తేలిపోతుంది.