జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రభుత్వ భూమి కబ్జా చేసి తన పేరిట రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆయన కుమార్తె తూల్జా భవాని మీడియాని పిలిచి చెప్పడమే కాకుండా వారిని వెంటబెట్టుకొని వెళ్ళి పట్టణంలో ఆ భూమి చుట్టూ నిర్మించిన ప్రహారీగోడను వారి సమక్షంలోనే జేసీబీలతో కూల్పించివేసి దానిని పురపాలక సంఘానికి తిరిగి అప్పగించిన సంగతి తెలిసిందే.
తన తండ్రి అవినీతిపరుడు, నియోజకవర్గం అభివృద్ధికి కృషిచేయరని కనుక మళ్ళీ ఆయనకు టికెట్ ఇవ్వొద్దని కోరుతూ సిఎం కేసీఆర్‌కు ఓ ఆమె ఓ లేఖ కూడా వ్రాశారు. సొంత కూతురే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు.
జనగామ నియోజకవర్గంలో బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా ఆయనకు టికెట్ ఇవ్వొద్దని కోరుతున్నారు. నిన్న వారందరూ హైదరాబాద్ వెళ్ళి అక్కడ హరితప్లాజాలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పీఏసీ ఛైర్మన్లు, ఇంకా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అనుచరులు కూడా పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తమతో చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని కనుక ఈసారి ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వకూడదని వారు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తే అందరూ కలిసి ఓడించాలని కూడా నిర్ణయించుకొన్నారు.
జనగామ నుంచి ఈసారి పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని, ఆయనకు టికెట్ ఇస్తే తామందరం కలిసి గెలిపించుకొంటామని మరో తీర్మానం చేశారు. నేడు కేటీఆర్‌ని కలిసి తమ ఈ తీర్మానాల గురించి తెలియజేయాలని వారు నిర్ణయించుకొన్నారు.
హరితప్లాజాలో తనకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారనే విషయం తెలుసుకొని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అక్కడకు చేరుకొని వారితో వాగ్వాదానికి దిగడంతో వారి సమావేశం రసాభాసగా ముగిసింది. పల్లా రాజేశ్వర్ రెడ్డే వెనకుండి వారి చేత ఈ కధ నడిపిస్తున్నారంటూ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే ఎవరెన్ని కుట్రలు చేసినా ఈసారి కూడా తనకే టికెట్ లభిస్తుందని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.