త్వరలో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. కనుక బిజెపి అధిష్టానం 5 రాష్ట్రాల అభ్యర్ధులను ఖరారు చేసేందుకు బుదవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది.
దీనిలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సహా ఆయా రాష్ట్రాల బిజెపి ఇన్ఛార్జ్లు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి అగ్రనేతలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు.
ఇటీవల కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ చేతిలో బిజెపి అనూహ్యంగా ఓడిపోయి అధికారం కోల్పోవడంతో ఆ ప్రభావం తెలంగాణ శాసనసభ ఎన్నికలపై పడే అవకాశం ఉంటుంది. సరిగ్గా ఎన్నికలకు ముందు బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించేసి కిషన్‌రెడ్డిని నియమించడం వలన కూడా తెలంగాణలో బిజెపికి కొంత నష్టం కలిగించింది.
ఇక లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో బిజెపి ఓడిపోతే ఆ ప్రభావం తప్పకుండా లోక్‌సభ ఎన్నికలపై కూడా పడవచ్చు. కనుక ఎట్టి పరిస్థితులలో ఈ 5 రాష్ట్రాలలో గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు సాయంత్రం ఢిల్లీలో జరుగబోయే బిజెపి ఎన్నికల కమిటే సమావేశంలో ఆయా రాష్ట్రాలలో అభ్యర్ధుల గురించి లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు.
ఇప్పటికే తెలంగాణలో 40-50 స్థానాలకు అభ్యర్ధులను బిజెపి ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. కానీ బిఆర్ఎస్ పార్టీ త్వరలోనే అభ్యర్ధుల తొలిజాబితాను ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నందున, దాని తర్వాతే తెలంగాణలో బిజెపి అభ్యర్ధులను ప్రకటించాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.