నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో ఆనవాయితీ ప్రకారం ‘ఎట్ హోమ్’ తేనీటి విందు ఇవ్వగా దానికి ఎప్పటిలాగే సిఎం కేసీఆర్‌తో సహ మంత్రులు అందరూ మొహం చాటేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎస్ శాంతికుమారి, డిజిపి అంజని కుమార్, టిఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్ధన్ రెడ్డి మాత్రం హాజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే కూడా ఈ విందుకు హాజరయ్యారు.
గవర్నర్ ఇచ్చే ఈ విందుకు ఎవరు వచ్చినా రాకపోయినా ప్రతిపక్ష నేతలు తప్పకుండా హాజరవుతుంటారు. కానీ ఈసారి కాంగ్రెస్, బిజెపి నేతలు కూడా డుమ్మా కొట్టారు. తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, సీపీఐ మహిళా నేత పశ్యపద్మ మాత్రమే హాజరయ్యారు.
నిన్న గోల్కొండ కోట వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించకపోవడంతో రాజ్‌భవన్‌లోనే అధికారుల సమక్షంలో గవర్నర్ త్రివర్ణ పతాకం ఎగురవేసి వేడుకలను జరుపుకొన్నారు.