
తెలంగాణలో రైతులకు పంట రుణాల మాఫీ కోసం ప్రభుత్వం సోమవారం రూ.5,809.78 కోట్లు విడుదల చేసింది. రూ.లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకొన్న రైతుల ఖాతాలలో ఆ సొమ్ము వెంటనే జమా అయ్యింది. 2018 ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ వివిద కారణాల చేత ఆ హామీని అమలుచేయలేదు. మళ్ళీ ఎన్నికలు ముంచుకొచ్చేస్తుండటంతో ఈ నెల 2 నుంచి పంట రుణాల మాఫీ ప్రక్రియని ప్రారంభించి దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.18,000 కోట్లు కేటాయించింది.
మొదటివిడతలో ఆగస్ట్ 3న రూ.41 వేల లోపు రుణాలు తీసుకొన్న 62,758 మంది రైతుల ఖాతాలలో రూ.237.85 కోట్లు జమా చేసింది. మళ్ళీ మర్నాడు 43 వేల లోపు రుణాలు తీసుకొన్న 31,339 మంది రైతుల ఖాతాలలో రూ.126.50 కోట్లు, స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ్ళ లక్ష లోపు రుణాలు తీసుకొన్న రైతుల ఖాతాలలో రూ.5,809 కోట్లు జమా చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 16,66,899 మంది రైతులకు కలిపి మొత్తం రూ.7,543.43 కోట్లు విడుదల చేసిన్నట్లయింది.
సెప్టెంబర్ 15వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని సిఎం కేసీఆర్ గడువు విధించినందున త్వరలోనే లక్ష రూపాయల పైగా పంట రుణాలను మాఫీ కోసం మరో రూ.10 వేల కోట్లు విడుదల చేయనుంది.