నాగర్‌కర్నూలు బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన 2018 ఎన్నికలలో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపిస్తూ నాగం జనార్ధన్ రెడ్డి వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, ఆయన చేసిన ఆరోపణలను నిరూపించే సాక్ష్యాధారాలను సమర్పించనందుకు ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ సోమవారం తీర్పు చెప్పింది.
2018 ముందస్తు ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన చాలా మంది అభ్యర్ధులు ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని ఆరోపిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో నాగం పిటిషన్ కూడా ఒకటి.
అటువంటి కేసులోనే కొత్తగూడెం బిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై హైకోర్టు అనర్హుడుగా తీర్పు చెప్పగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్‌పై ఇంకా విచారణ జరుపుతోంది. ఈ నేపధ్యంలో నాగం వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో మర్రి జనార్ధన్ రెడ్డికి చాలా ఊరట లభించినట్లే భావించవచ్చు.