వివేకా కేసుతో హైదరాబాద్‌ పోలీసులకు తలనొప్పులు!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ముందుకు సాగనీయకుండా అడ్డుకొంటుండటంతో ఆయన కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఆ కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేయించుకొన్నారు. అప్పటి నుంచి సీబీఐ అధికారులు,  సీబీఐ కోర్టు లేదా తెలంగాణ హైకోర్టు ఆ కేసులో నిందితులను విచారిస్తున్నప్పుడు, కడప నుంచి వారి అనుచరులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకోవడం, వారికి మద్దతుగా నినాదాలు చేస్తుండటం, పోలీసులతో వాగ్వాదాలకి దిగుతుండటం పరిపాటిగా మారిపోయింది. 

సోమవారం ఉదయం నాంపల్లి, సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా కోర్టుకు వచ్చారు. ఎప్పటిలాగే ఈ కేసులో నిందితులందరినీ పోలీసులు న్యాయస్థానం తీసుకువచ్చారు. వారిలో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. కనుక కడప నుంచి భారీ సంఖ్యలో ఆయన అనుచరులు సీబీఐ కోర్టు వద్దకు చేరుకొని పోలీస్ వాహనాన్ని అడ్డగించేందుకు ప్రయత్నించారు. అప్పుడు పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి అక్కడి నుంచి తరిమేశారు. 

పొరుగు రాష్ట్రం ఏపీలో హత్య జరిగితే అది ఏపీ ప్రభుత్వ సమస్య అవుతుంది కానీ ఈ కేసు హైదరాబాద్‌ పోలీసుల మెడకు చుట్టుకొంది. ఈ కేసు ఎప్పుడు విచారణ జరిగినా ఎప్పుడూ ఇదే తంతు. ఈ కేసులో నిందితుల కంటే వారి కోసం కడప నుంచి వస్తున్నవారి అనుచరులతోనే హైదరాబాద్‌ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. 

ఈరోజు సీబీఐ కోర్టులో అవినాష్ రెడ్డితో సహా నిందితులందరినీ ప్రవేశపట్టిన తర్వాత ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్‌ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సీబీఐ కోర్టు ప్రకటించింది. అంటే ఆ రోజు మళ్ళీ వీళ్ళ తలనొప్పులు భరించాలన్న మాట! 

వివేకా హత్య జరిగి నాలుగేళ్ళు అవుతున్నా ఇంతవరకు దోషులకు శిక్షలు పడలేదు. ఎందుకంటే నిందితులు అందరూ ఏపీలో చాలా శక్తివంతమైన అధికార వైసీపీకి చెందినవారు కావడమే కారణం. ఆ కారణంగా ఏపీలో కేసు విచారణ ముందుకు సాగడం లేదని హైదరాబాద్‌కు బదిలీ చేస్తే ఇక్కడ అలాగే సాగుతోంది. కనుక ఇంకా ఎన్నేళ్ళు హైదరాబాద్‌లో ఈ కేసు విచారణ సాగుతుందో  ఎవరికీ తెలీదు. కనుక అంతవరకు హైదరాబాద్‌ పోలీసులకు, ప్రజలకు ఈ తలనొప్పులు భరించక తప్పదు.