11.jpg)
తెలంగాణ శాసనసభ గడువు ఈ ఏడాది డిసెంబర్లో ముగుస్తుంది కనుక అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ మొదటివారంలోగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ నెల 17వ తేదీ నుంచి పవిత్రమైన శ్రావణమాసం మొదలవుతుంది కనుక అదే రోజున లేదా మర్నాడు తొలి శ్రావణశుక్రవారం నాడు సిఎం కేసీఆర్ 50 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ముందుగా ఎటువంటి వివాదాలు, అంతర్గత పోటీలేని మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలకు వారినే అభ్యర్ధులుగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత రెండో జాబితాలో ఒకరిద్దరు పోటీ పడుతున్న స్థానాలకి, చివరిగా చాలా వివాదాస్పదంగా ఉన్న స్థానాలకు సిఎం కేసీఆర్ అభ్యర్ధులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ఈసారి ఎన్నికలలో సుమారు 10-20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం దక్కకపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక ఎవరెవరి సీట్లు గల్లంతుకానున్నాయో, వారి స్థానంలో కొత్తగా ఎవరికి టికెట్స్ లభిస్తాయో తెలియాలంటే మూడో జాబితా విడుదల చేసేవరకు ఎదురు చూడాల్సిందే.
మునుగోడు ఉపఎన్నికలలో కేసీఆర్ వామపక్షాలతో పొత్తులు పెట్టుకొని విజయం సాధించారు. అయితే శాసనసభ ఎన్నికలలో కూడా వామపక్షాలతో పొత్తులు పెట్టుకొంటారా? పెట్టుకొంటే ఆ రెండు పార్టీలు తమకు కనీసం 5-10 సీట్లు ఇవ్వాలని పట్టుబట్టవచ్చు. అందుకు కేసీఆర్ సిద్దపడితే బిఆర్ఎస్ పార్టీలో ఆ సీట్లను సిట్టింగ్ ఎమ్మెల్యేలు వదులుకోవలసి వస్తుంది. అందుకు వారు, సిఎం కేసీఆర్ కూడా ఒప్పుకోకపోవచ్చు కనుక 2-3 సీట్లతో సర్దుకుపోయేందుకు వామపక్షాలు అంగీకరిస్తే పొత్తులు ఉండవచ్చు లేకుంటే ఎప్పటిలాగే మజ్లీస్ పార్టీతో కలిసి బిఆర్ఎస్ పోటీ చేయవచ్చు.