త్వరలో చేనేత కార్మికులకు కూడా రుణమాఫీ?

తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఓ శుభవార్త చెప్పారు. వారికి కూడా రుణమాఫీ పధకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. 

శనివారం భూదాన్ పోచంపల్లిలో చేనేత కార్మికులతో సమావేశమైనప్పుడు వారిని ఉద్దేశ్యించి మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, “ఒకప్పుడు దుబ్బాకలో ఓ చేనేత కార్మికుడి ఇంట్లో సిఎం కేసీఆర్‌ కొంతకాలం ఉన్నారు. కనుక చేనేత కార్మికుల కష్టానష్టాలన్నీ బాగా తెలుసు. అందుకే రాష్ట్రంలో చేనేత కార్మికులకు మేలు చేసే అనేక కార్యక్రమాలు, పధకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారు. కనుముక్కలలో మూతపడిన హ్యాండ్ లూమ్ పార్కుకు రూ.12 కోట్లు కేటాయించారు. త్వరలోనే దీనిని ప్రారంభించబోతున్నాము. 

చేనేత కార్మికులందరికీ హెల్త్ కార్డులు అందజేయబోతున్నాము. నేత కార్మికుల ఆరోగ్య భీమాను 57 నుంచి 75 ఏళ్ళకు పెంచాము. తెలంగాణ చేనేత మగ్గం పేరుతో రూ.40 కోట్లు ఖర్చు చేసి 16 వేల ఆధునిక మగ్గాలను అందజేయబోతున్నాము. కోకాపేటలో నిర్మితమవుతున్న కన్వెన్షన్ సెంటర్‌లో చేనేత మ్యూజియం, సేల్స్ కౌంటర్స్ ఏర్పాటుచేయబోతున్నాము. 

కేంద్ర ప్రభుత్వం చేనేత ఉత్పత్తులపై కూడా 5శాతం జీఎస్టీ (పన్ను) విధించి ఈ రంగాన్ని చావు దెబ్బ తీస్తుంటే, తమ ప్రభుత్వం చేనేత రంగాన్ని బ్రతికించుకొని మళ్ళీ పూర్వవైభవం కల్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.