భారత్‌ నేర చట్టలలో పెను మార్పులకు శ్రీకారం

బ్రిటిష్ కాలంనాటి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) స్థానంలో కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త చట్టాలను తెచ్చేందుకు లోక్‌సభలో శుక్రవారం మూడు బిల్లులు ప్రవేశపెట్టింది.

వాటి పేర్లు 1. కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్), 2. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత్ (బీఎన్ఎస్ఎస్), 3. భారతీయ సాక్ష్య (బి‌ఎస్).

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ మూడు బిల్లులను లోక్‌సభలో నిన్న ప్రవేశపెట్టారు. ఎప్పుడో బ్రిటిష్ కాలంనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఐపిసి స్థానంలో దేశంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ప్రజలకు మరింత భద్రత కల్పిస్తూ, పోలీస్ మరియు న్యాయవ్యవస్థలు మరింత జవాబుదారీతనంతో పనిచేసేందుకు ఈ కొత్త చట్టాలను తేవాలనుకొంటున్నట్లు అమిత్‌ షా చెప్పారు.

వీటిని పార్లమెంటులో ప్రవేశపెట్టేముందు భారతీయ శిక్షాస్మృతిపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఐపిసి చట్టంలో అనవసరమైన సెక్షన్స్ తొలగించి, అవసరమైనవి జోడించి ఈ మూడు చట్టాలు తేవాలనుకొంటున్నామని అమిత్‌ షా చెప్పారు.     

ఐపీసీలో మొత్తం 511 సెక్షన్స్ ఉండగా బీఎన్ఎస్‌లో 356 సెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఐపీసీలో హత్యానేరాన్ని సెక్షన్ 302, చీటింగ్ కేసు సెక్షన్ 420తో నమోదు చేస్తుండగా బీఎన్ఎస్‌లో ఇవి సెక్షన్స్ 99, 316గా మారుతాయి.    

వీటిలో ప్రధానమైన మార్పులు: రాజద్రోహం సెక్షన్ పూర్తిగా రద్దు ప్రతిపాదన. మహిళలు, చిన్నారులపై హత్యలు, అత్యాచారాలు వంటి నేరాలకు పాల్పడితే మరింత కటినమైన శిక్షలు. ఎటువంటి కేసులైనా గరిష్టంగా మూడేళ్ళలోపు పరిష్కరింపబడాలి. కేసు నమోదు మొదలు, దర్యాప్తు, కోర్టు విచారణ, తీర్పు వరకు ప్రతీ విషయాన్ని డిజిటల్ రూపంలో ఉంచాలి. దేశంలో ఎవరినైనా అరెస్ట్‌ చేయాల్సివస్తే సదరు పోలీస్ అధికారి అరెస్ట్‌ చేస్తున్న విషయాన్ని, అతను లేదా ఆమె భద్రతకు తమదే పూర్తి బాధ్యత ని తెలియజేస్తూ ఓ ధృవీకరణ పత్రాన్ని కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా ఇవ్వాలి.  

ఈ మూడు బిల్లులను పార్లమెంటు స్థాయి సంఘం పరిశీలనకు పంపామని, శీతాకాల సమావేశాలలో వీటిని పార్లమెంటు ఆమోదించిన వెంటనే చట్టరూపం దాలుస్తాయని అమిత్‌ షా చెప్పారు.