
మంత్రి శ్రీనివాస్ గౌడ్ గత ఎన్నికలలో ఎన్నికల సంఘానికి సంర్పించిన అఫిడవిట్‌ను ఓ రిటర్నింగ్ అధికారి సాయంతో మార్చారంటూ ప్రజాప్రతిధుల కోర్టులో దాఖలైన కేసులో ఆయనతో సహా ఆయనకు సహకరించిన 10మంది అధికారులపై కేసు నమోదు చేయాలని మహబూబ్‌నగర్ పోలీసులను న్యాయస్థానం ఇదివరకు ఆదేశించింది.
అయితే ఇంతవరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేయలేదని, ఇది కోర్టు ధిక్కారమే అవుతుందని కనుక వారిపై చర్యలు తీసుకోవలసిందిగా పిటిషనర్ రాఘవేంద్రరాజు మళ్ళీ కోర్టుని ఆశ్రయించారు.
ఆయన పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన కోర్టు, మహబూబ్‌నగర్ పోలీసులకు నోటీస్ జారీ చేసింది. తమ ఆదేశం ప్రకారం వారిపై కేసులు నమోదు చేశారో లేదో తెలపాలని దానిలో కోరింది. ఒకవేళ నమోదు చేసినట్లయితే ఇవాళ్ళ (శుక్రవారం) సాయంత్రంలోగా ఆ ఎఫ్ఐఆర్ కాపీలతో సహా అన్ని వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ నేటికీ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే కారణాలు తెలుపుతూ కౌంటర్ దాఖలు చేయాలని లేకుంటే కోర్టు ధిక్కారంగా పరిగణించవలసి వస్తుందని ప్రజాప్రతినిధుల కోర్టు మహబూబ్‌నగర్ పోలీసులను హెచ్చరించింది.
ఇంతకు ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనపై సాగుతున్న ఈ అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసు విచారణను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయగా హైకోర్టు దానిని కొట్టివేసింది. ఇప్పుడు ప్రజాప్రతినిధుల కోర్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారా లేదా? అని అడుగుతోంది. ఈ కేసులో ఆయనపై కూడా అనర్హత వేటు పడుతుందో లేక బయటపడతారో త్వరలోనే తేలిపోవచ్చు.