జయప్రదకు ఆర్నెల్లు జైలు శిక్ష

అలనాటి అందాల నటి, మాజీ ఎంపీ జయప్రదకు చెన్నైలోని ఎగ్మూరు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఆమెకు చెన్నైలోని రాయపేటలో ఓ సినిమా థియేటర్‌ ఉంది. దానిని ఆమె స్వయంగా చూసుకోలేరు కనుక చెన్నైలో ఉంటున్న రాజ్‌కుమార్‌, రాజబాబులకు దాని బాధ్యతలు అప్పగించారు.

వారిరురువూ ఆ థియేటర్‌లో పనిచేస్తున్న సిబ్బంది జీతాలలో నుంచి కార్మిక భీమా (ఈఎస్ఐ) కొరకు సొమ్ము కోసుకొంటున్నారు కానీ దానికి యాజమాన్యం వాటాను కలిపి జమా చేయకుండా ఎగవేశారు. దాంతో కార్మికులు ఎగ్మోర్ కోర్టుని ఆశ్రయించగా, ఈ విషయం తెలుసుకొన్న జయప్రద ఆ సొమ్మును తాను చెల్లిస్తానని కనుక ఈ కేసును కొట్టివేయాలని కోరారు.

కానీ ఈఎస్ఐ తరపు న్యాయవాది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసిన నేరం కనుక సినిమా థియేటర్‌ యాజమాన్యానికి శిక్ష విధించాల్సిందే అని గట్టిగా వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన ఎగ్మూర్ కోర్టు జయప్రదతో సహా వారిరువురికి కూడా ఆరు నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఎగ్మూరు కోర్టు తీర్పుపై జయప్రద మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించనున్నారు.