పాలమూరు పధకానికి కేంద్రం లైన్ క్లియర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకానికి కేంద్ర పర్యావరణ కమిటీ షరతులతో అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే చేపట్టిన ఈ పధకంలో అనేక పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని, వాటి పరిహరానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వులలో పేర్కొంది. ఆ వివరాలు...

• జాతీయ హరిత ట్రిబ్యూనల్ గతంలో సూచించిన అన్ని సూచనలను, సలహాలను అమలుచేయాలి. 

• ఈ ప్రాజెక్టులో జరిగిన పర్యావరణ నష్టాన్ని, సామాజిక నష్టాన్ని సరిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.153.70 కోట్లు విడుదల చేయాలి. 

• ఈ సొమ్ముకు రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలి. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్వర్యంలో రాబోయే ఐదేళ్ళలో ఈ సొమ్ముతో అవసరమైన నష్టానివారణ చర్యలు చేపట్టాలి. 

• రాష్ట్ర అటవీశాఖ మరియు స్థానిక పంచాయితీల అధ్వర్యంలో వాటి పరిధిలో గల జలాశాయల వద్ద 50 మీటర్ల వెడల్పున చెట్లు పెంచాలి. 

• ఈ ప్రాజెక్టు పరిధిలో గ్రామాలకు మెరుగైన వైద్యసేవలు కల్పించి, స్థానిక యువతకు వృత్తి నైపుణ్యం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం శిక్షణా కేంద్రాలను స్థాపించి నిర్వహించాలి.      

రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఈ ప్రాజెక్టుని ప్రారంభించి మొదటి దశ పనులు పూర్తిచేసింది. శ్రీశైలం బ్యాక్‌ వాటర్స్ నుంచి రోజుకు 1.5 టీఎంసీల నీళ్ళ చొప్పున 60 రోజులలో 90 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోయడం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలోని 12.38 లక్షల ఎకరాలకు సాగునీరు, ఆ జిల్లాలలోని గ్రామాలకు స్వచ్చమైన త్రాగునీరు లభిస్తుంది.

ఈ ప్రాజెక్టు రెండో దశ పనులు పూర్తయితే మరో 12 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. ఈ ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు లభించడంపై సిఎం కేసీఆర్‌, మంత్రులు హరీష్ రావు ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే కృష్ణమ్మ నీటితో పాలమూరు పాదాలు కడుగుతామని అన్నారు.