అజారుద్దీన్ ఈసారి శాసనసభకు... జూబ్లీహిల్స్‌ నుంచి?

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్, తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ గతంలో యూపీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గత ఎన్నికలలో సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేయాలని ఆశ పడ్డారు కానీ అవకాశం లభించలేదు. కనుక ఈసారి తప్పకుండా ఎన్నికలలో పోటీ చేయాలనుకొంటున్నారు. అయితే లోక్‌సభకు కాదు శాసనసభకు!ఈసారి ఆయన జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికలలో పోటీ చేసి శాసనసభలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు.

దానికి బలమైన కారణమే కనిపిస్తోంది. కేసీఆర్‌ ప్రభుత్వం పదేళ్ళుగా రాష్ట్రాన్ని పాలిస్తుండటంతో ప్రజలలో ఎంతో కొంత వ్యతిరేకత నెలకొని ఉంది. ఇదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హటాత్తుగా పుంజుకోవడంతో ఈసారి ఎన్నికలలో తప్పకుండా గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చనే భావన ప్రజలలో బలంగా వ్యాపించింది.

అందుకే బిజెపిలో చేరాలనుకొన్న నేతలు కూడా కాంగ్రెస్‌ గూటికి చేరుకొంటున్నారని చెపొచ్చు. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ పార్టీ శాసనసభ్యుడుగా ఉంటే ఆ హోదాయే వేరు. పైగా మంత్రివర్గంలో కూడా అవకాశం లభించవచ్చు. కనుక అజారుద్దీన్ శాసనసభకు పోటీ చేయాలనుకొంటున్నారని భావించవచ్చు.

బుదవారం ఆయన జూబ్లీహిల్స్‌లో రహమత్ నగర్‌లో సమావేశం నిర్వహించారు. అయితే జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి ఈ విషయం తెలియడంతో వెంటనే అనుచరులను వెంటపెట్టుకొని అక్కడకు చేరుకొని అజారుద్దీన్‌తో వాగ్వాదానికి దిగారు. నా నియోజకవర్గంలో మీకేం పని? ఇక్కడ సమావేశాలు ఎందుకు పెడుతున్నారంటూ గట్టిగా నిలదీశారు.

ఈ సందర్భంగా ఇరువర్గాల మద్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని ఇరువర్గాలకు నచ్చచెప్పడంతో అందరూ శాంతించారు. కానీ మళ్ళీ జూబ్లీహిల్స్‌లో అడుగుపెడితే సహించేది లేదని విష్ణువర్ధన్ రెడ్డి ఆహారుద్దీన్‌కు గట్టిగా హెచ్చరించారు. మరి అజారుద్దీన్ ఏమి చేస్తారో... ఎక్కడి నుంచి పోటీ చేస్తారో?